పవన్ కల్యాణ్ క్షమాపణలు దేనికోసం?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒదిగి ఉండే స్వభావం గురించి ఎంత చెప్పినా తక్కువే.
By: Tupaki Desk | 25 July 2025 9:21 AM ISTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒదిగి ఉండే స్వభావం గురించి ఎంత చెప్పినా తక్కువే. చిరంజీవికి తమ్ముడే అయినా, తన జీవితం వడ్డించిన విస్తరి కాదని, ఏదీ అంత సులువుగా తనకు లభించలేదని సూటిగా చెప్పారు పవన్. ఆయన నటించిన భారీ చిత్రం `హరి హర వీరమల్లు` ఇటీవల థియేటర్లలో విడుదలైంది. పవర్ స్టార్ మానియాతో ఆరంభ వసూళ్లకు డోఖా లేదు. ఈ సోమవారం నుంచి వీరమల్లు రియల్ బాక్సాఫీస్ గేమ్ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.
మరోవైపు ఈ గురువారం సాయంత్రం సక్సెస్ మీట్ లో పవన్ ఎంతో ఉద్విగ్నభరితంగా మాట్లాడారు. ఇంతకుముందు తన రాజకీయాల వల్ల, ప్రత్యర్థుల కుట్రల కారణంగా తన నిర్మాతలు నష్టపోయారని వ్యాఖ్యానించిన పవన్, చాలా బాధ్యతగా ఏ.ఎం.రత్నం కోసం `.... వీరమల్లు` ప్రమోషన్స్ కి అన్నివిధాలా సహకరిస్తున్నారు. హరిహర వీరమల్లు ప్రచారం తన బాధ్యత అని ప్రకటించిన పవన్, ఉప ముఖ్యమంత్రి హోదాలో కొన్ని రాజకీయ వ్యవహారాలను సైతం వాయిదా వేసుకుని మరీ గురువారం సాయంత్రం సక్సెస్ వేడుకకు హాజరయ్యారు.
అయితే సక్సెస్ మీట్ కి రావడం ఆలస్యం కావడంతో ముందుగా పవన్ కల్యాణ్ తన కోసం వేచి చూస్తున్నవారందరికీ క్షమాపణలు చెప్పారు. కేబినెట్ మీటింగ్ ఆలస్యం కావడంతో ఆలస్యమైందని వివరణ ఇచ్చారు. నిజానికి ఆలస్యానికి కారణాలు చెప్పుకుని సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఆయనకు లేదు. కానీ ఎంతో వినమ్రతతో, ఒదిగి ఉండే స్వభావంతో ఆయన అందరి మనసులు గెలుచుకున్నారు. నాకు సినిమా ప్రమోషన్లు అలవాటు లేదు! అంటూనే తన మిత్రుడు రత్నం కోసం కావాల్సిన ప్రమోషన్ అంతా చేసారు పవన్. నిజానికి పవన్ ప్రవర్తన, ఒదిగి ఉండే స్వభావం ఇతర ఔత్సాహిక నటీనటులు స్ఫూర్తి కావాలి. ఏ రంగంలో అయినా, ఈ రెండు అరుదైన లక్షణాలతో మాత్రమే చాలా ఎత్తుకు ఎదిగేందుకు ఆస్కారం ఉంటుంది.
