మిక్స్డ్ టాక్‌తోనే రికార్డ్ కొట్టిన పవన్
టాలీవుడ్లో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా క్రేజ్‌ను నిలబెట్టుకుంటూ వస్తున్న హీరో పవన్ కళ్యాణ్.
By: Tupaki Desk | 25 July 2025 7:00 PM ISTటాలీవుడ్లో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా క్రేజ్‌ను నిలబెట్టుకుంటూ వస్తున్న హీరో పవన్ కళ్యాణ్. ఆయనకు ఉన్న స్టామినాకు సరైన సినిమాలు చేస్తే బాక్సాఫీస్ షేక్ అయిపోతుందని అందరికీ తెలుసు. కానీ చాలా ఏళ్ల నుంచి పవన్ ఎక్కువగా రీమేక్ సినిమాలే చేస్తూ అభిమానులను నిరాశకు గురి చేస్తున్నారు. అయినా సరే ఆ సినిమాలు అంచనాలకు మించే ఆడుతున్నాయి.
ఇప్పుడు పవన్ చాలా గ్యాప్ తర్వాత స్ట్రెయిట్ మూవీతో పలకరించాడు. అదే.. హరిహర వీరమల్లు. కానీ ఈ సినిమా మొదలైనపుడు ఉన్న హైప్ వేరు. రిలీజైనపుడు పరిస్థితి వేరు. విపరీతంగా ఆలస్యం కావడం, దర్శకుడు మారడం.. రిలీజ్ పదే పదే వాయిదా పడడం.. ఇలా పలు కారణాలతో సినిమా మీద అంచనాలు తగ్గిపోయాయి. పైగా ఈ చిత్రానికి ముందు రోజు ప్రిమియర్స్ నుంచే బ్యాడ్ టాక్ మొదలైంది. తొలి రోజు నెగెటివ్ టాక్ మరింత స్ప్రెడ్ అవుతున్న సంకేతాలే కనిపించాయి సోషల్ మీడియాలో. అయినా సరే.. బాక్సాఫీస్ దగ్గర పవన్ తన స్టామినాను చూపించాడు.
పవన్ కళ్యాణ్ కెరీర్లో హైయెస్ట్ డే-1 గ్రాసర్‌గా ‘హరిహర వీరమల్లు’ రికార్డు సృష్టించింది. ఈ సినిమా డే-1 రూ.43-44 కోట్ల మధ్య వసూళ్లు రాబట్టినట్లు అంచనా. ఇందులో ముందు రోజు సెకండ్ షో ప్రిమియర్స్ ద్వారా వచ్చిన వసూళ్లు కూడా ఉన్నాయి. ఇప్పటిదాకా పవన్ కెరీర్లో హైయెస్ట్ డే-1 రికార్డు వకీల్ సాబ్ పేరిట ఉంది. రాజకీయాల్లో బిజీ అయ్యాక గ్యాప్ తీసుకున్న పవన్.. ఈ చిత్రంతోనే రీ ఎంట్రీ ఇచ్చాడు.
2021లో వచ్చిన ఆ సినిమా తొలి రోజు రూ.41 కోట్లు కలెక్ట్ చేసింది. ‘భీమ్లా నాయక్’ దీనికి మించి హైప్ తెచ్చుకున్నప్పటికీ.. ఏపీలో జగన్ ప్రభుత్వం బెనిఫిట్ షోలు రద్దు చేసి, టికెట్ల ధరలు తగ్గించేయడంతో రికార్డు కొట్టలేకపోయింది. ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’ తొలి రోజు వసూళ్లలో కొత్త రికార్డు నెలకొల్పింది. డివైడ్ టాక్‌ను తట్టుకుని ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం పవన్ స్టార్ పవర్‌కు నిదర్శనం. మరి తర్వాతి మూడు రోజుల్లో కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి.
