పవన్ 'ఉస్తాద్'.. వరల్డ్ ఫస్ట్ షో ఎక్కడంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు సిద్ధమవుతోంది.
By: M Prashanth | 7 March 2026 12:12 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు సిద్ధమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఆ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్- హరీష్ శంకర్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
అదే కాంబో మళ్లీ కలిసి పనిచేస్తుండటంతో సినిమాపై ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది. ఇప్పటికే మూవీకి సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు విడుదలై సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. పవన్ కళ్యాణ్ స్టైల్, హరీష్ శంకర్ మాస్ మేకింగ్ కలిసి వస్తే మరోసారి బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తుందనే నమ్మకం రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానుల్లో కనిపిస్తోంది.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాస్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే సమయంలో విదేశాల్లో కూడా సినిమాకు మంచి క్రేజ్ కనిపిస్తోంది. యూకేలోని కొన్ని థియేటర్లలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా సినీ వరల్డ్ థియేటర్లలో టికెట్ అమ్మకాలు రీసెంట్ గా స్టార్ట్ అయినట్లు సమాచారం.
ఫుల్ జోష్ లో ప్రీ బుకింగ్స్ జరుగుతున్నట్లు తెలుస్తుండగా.. తొలి షోలు బ్రిటన్ టైమ్ ప్రకారం.. మార్చి 18వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు) ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి షో అదేనని తెలుస్తోంది. త్వరలో మరిన్ని థియేటర్లలో కూడా టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయని సమాచారం.
ఇక సినిమా విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ సరసన యంగ్ బ్యూటీస్ శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాంగ్స్ ను దేవిశ్రీప్రసాద్ అందిస్తుండగా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను తమన్ అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా అయానక బోస్ పనిచేస్తుండగా, ఎడిటింగ్ బాధ్యతలను చోటా కే ప్రసాద్ నిర్వహిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్ దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే షూటింగ్, డబ్బింగ్ పనులు పూర్తయ్యాయని దర్శకుడు హరీష్ శంకర్ వెల్లడించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే ఉగాది కానుకగా మార్చి 19వ తేదీన సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. మరి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో అంతా వేచి చూడాలి.
