'ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం'.. ఉస్తాద్ ట్రైలర్ ఎలా ఉంది?
గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మంచి విజయం సాధించడంతో.. ఉస్తాద్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ వాటిని మరింత పెంచుతోంది.
By: M Prashanth | 14 March 2026 8:21 PM ISTఉస్తాద్ భగత్ సింగ్.. కొన్నిరోజులుగా ఆ సినిమా కోసం ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ మూవీ ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మంచి విజయం సాధించడంతో.. ఉస్తాద్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ వాటిని మరింత పెంచుతోంది.
సుమారు 2 నిమిషాల 7 సెకన్ల నిడివితో వచ్చిన ట్రైలర్ పూర్తిగా పవన్ క్యారెక్టర్ ఎలివేషన్ పై దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. "వాడు నీకు భయపడలేదా?.. అసలు ఎవడికీ భయపడలేదా?" అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ గా పవన్ మాస్ ఎంట్రీ, ఆయన బాడీ లాంగ్వేజ్, స్టైల్ అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేలా ఉన్నాయి.
సినిమాలో పవన్.. భగత్ సింగ్ అనే పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ట్రైలర్ లో ఆయన విలన్లను ఎదుర్కొనే యాక్షన్ సన్నివేశాలతో పాటు కామెడీ టచ్ కూడా ఉంది. "తెలుగు భాషలో నాకు నచ్చని ఒక్క పదం డ్యాన్స్" అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. "వయలెన్స్ అంటే మీనింగ్ తెలియకపోవడం మీ అందరికీ ఫ్యాషన్ అయిపోయింది.. చూపిస్తా అర్థం, భావం, అవసరం అన్నీ చూపిస్తా" అనే పవర్ ఫుల్ డైలాగ్ మెయిన్ హైలైట్‌గా నిలిచింది.
"సంతోషంగా ఉండటం అంటే మన జీవితాన్ని మనం లైక్ చేసుకోవడం.. ఎవడెవడో లైకులు కొట్టడం కాదు" వంటి డైలాగ్స్ హరీష్ శంకర్ మార్క్ మాస్ స్టైల్ ను గుర్తు చేస్తున్నాయి. "ఈ దేశపు మగవాళ్లు బొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా" అనే డైలాగ్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. సినిమాలో హీరోయిన్లుగా శ్రీలీల, రాశీ ఖన్నా యాక్ట్ చేస్తుండగా.. ట్రైలర్ లో ఇద్దరికీ చోటు ఇచ్చారు మేకర్స్.
"ఆయన కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి మ్యాజిక్ జరుగుతుంది" అంటూ శ్రీలీల చెప్పే డైలాగ్ ద్వారా హీరో పాత్రకు ఎలివేషన్ ఇచ్చారు. రాశి ఖన్నా పాత్రను ట్రైలర్ లో తక్కువగా చూపించినా కథలో ఆమెకు ప్రాధాన్యం ఉండొచ్చని తెలుస్తోంది. ఏదేమైనా ట్రైలర్ మొత్తం మాస్ యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంది. పోలీస్ పాత్రలో పవన్ ఫైట్స్, స్టైలిష్ ఎంట్రీ షాట్స్ అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
చివర్లో వచ్చే "ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం.. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలవుతుంది" డైలాగ్ ట్రైలర్ కు మరింత హైప్ తీసుకొచ్చింది. సినిమాలో విలన్ గా పార్తీబన్ కనిపించనుండగా, ఇతర కీలక పాత్రల్లో రావు రమేష్, ప్రభాస్ శ్రీను తదితరులు నటిస్తున్నారు. సంగీతాన్ని దేవిశ్రీప్రసాద్ అందించగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తమన్ సమకూర్చారు. ట్రైలర్ లో వినిపించిన బీజీఎం మాస్ ఫీల్ ను మరింత పెంచింది. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్.. కంప్లీట్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా రూపొందినట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. మరి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.
