Begin typing your search above and press return to search.

ఉస్తాద్ ఎక్స్‌పెరిమెంట్.. రేట్లు తగ్గినా రికార్డులు పెరుగుతాయా?

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   18 March 2026 3:13 PM IST
ఉస్తాద్ ఎక్స్‌పెరిమెంట్.. రేట్లు తగ్గినా రికార్డులు పెరుగుతాయా?
X

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖ‌న్నా హీరోయిన్లుగా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మించింది. సినిమా రిలీజ్ కు ముందు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మేకర్స్ మూవీ గురించి పలు ఆసక్తికర విష‌యాల‌ను వెల్లడించారు.

తెలంగాణ‌లో సాధార‌ణ రేట్ల‌తోనే రిలీజ్

ఈ మ‌ధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెంచడం ఒక సాధారణ ధోరణిగా మారింది. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో మాత్రం మేకర్స్ విభిన్న నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఈ సినిమాను సాధారణ టికెట్ రేట్లతో రిలీజ్ చేయాలని నిర్ణయించామని నిర్మాత మైత్రీ నవీన్ వెల్లడించారు. సుప్రీమ్ కోర్ట్ తీర్పు తర్వాత ప్రభుత్వంతో సమావేశ‌మ‌య్యే అవకాశం లేకపోవడంతో పాటు, టికెట్ ధరల పెంపు లేకుండా సినిమా ఎలాంటి ఫ‌లితాన్నిస్తుందో పరిశీలించాలనే ఉద్దేశంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశం

ఈ నిర్ణయం పరిశ్రమలోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. భారీ అంచనాలు ఉన్న స్టార్ సినిమా అయినప్పటికీ టికెట్ రేట్లు పెంచకుండా విడుదల చేయడం అరుదైన విషయంగా భావిస్తున్నారు. ఇది బాక్సాఫీస్ కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నదానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. కాగా ప్రెస్ మీట్‌లో మరో హైలైట్‌గా నిలిచింది దర్శకుడు హరీష్ శంకర్ లీక్ చేసిన డైలాగ్. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పే డైలాగ్ ను హ‌రీష్ లీక్ చేశారు. భగవద్గీతను యుద్ధం మధ్యలో చెప్పారు కానీ, యుద్ధాన్ని మధ్యలో వదిలేయమని చెప్పలేదు అనే డైలాగ్ ను సినిమాలో ప‌వ్ చెప్తార‌ని హ‌రీష్ చెప్ప‌డంతో ఆ డైలాగ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచింది.

కాగా ఆల్రెడీ రిలీజైన ట్రైలర్‌లోనూ పలు పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్స్‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్యారెక్టర్‌ను హైలైట్ చేశారు. హరీష్ శంకర్ తన ప్రత్యేకమైన మాస్ రైటింగ్ స్టైల్‌ను ఈ సినిమాలో మరింతగా ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. అభిమానులు ఆశించే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన మెసేజ్‌ను కూడా సినిమాలో చేర్చినట్లు సమాచారం.

మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ సాధారణ టికెట్ రేట్లతో విడుదల కావడంతో పాటూ సినిమాపై ఉన్న హైప్ సినిమాను వార్త‌ల్లో నిల‌బెడుతోంది. ఉగాది సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. గ‌తంలో ప‌వ‌న్- హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన గ‌బ్బ‌ర్ సింగ్ లాగానే ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలుస్తుంద‌ని ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.