తిరుపతిలో ఉస్తాద్ అప్‌డేట్ ఇచ్చిన దర్శకుడు
హరిహర వీరమల్లు సినిమాను మొదట పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఆ వెంటనే ఓజీ సినిమా షూటింగ్ కోసం డేట్లు ఇచ్చాడు.
By: Tupaki Desk | 3 Jun 2025 4:00 PM ISTపవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' సినిమా జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో ప్రారంభం అయిన హరి హర వీరమల్లు సినిమా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పూర్తి అయింది. ఏఎం రత్నం నిర్మాణంలో రూపొందిన వీరమల్లు సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా ఏళ్లు అయింది. పవన్ రాజకీయాలు, పరిపాలన ఇతర విషయాల కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ప్రారంభించిన సినిమాలను పూర్తి చేసేందుకు డేట్లు ఇవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
హరిహర వీరమల్లు సినిమాను మొదట పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఆ వెంటనే ఓజీ సినిమా షూటింగ్ కోసం డేట్లు ఇచ్చాడు. మొన్నటి వరకు ముంబైలో కీలక షెడ్యూల్‌ను ఓజీ మేకర్స్ షూట్ చేసిన విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్‌తో సహా ముఖ్యులు ఆ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఓజీ సినిమాకు సాహో సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఓజీ సినిమా లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తూ ఉండగా, బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇమ్రాన్ హస్మీ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ రెండు సినిమాలు కాకుండా పవన్ కళ్యాణ్ మరో సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్‌ను మొదలు పెట్టిన విషయం తెల్సిందే.
హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రారంభం అయిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒక తమిళ్ మూవీకి అధికారిక రీమేక్ అనే విషయం తెల్సిందే. సినిమా ఒక్క షెడ్యూల్ పూర్తి అయిన వెంటనే పవన్ రాజకీయాలతో బిజీ అయ్యాడు. దాంతో సినిమాను పూర్తిగా వదిలేస్తారు అనే టాక్ వినిపించింది. కానీ పవన్ మాత్రం ప్రారంభించిన సినిమాను వదిలేయడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశ్యంతో సినిమాను పూర్తి చేసేందుకు ఓకే చెప్పాడు. అయితే రీమేక్ కాకుండా కాస్త అటు ఇటుగా అదే జోనర్‌లో ఉండే కొత్త కథను హరీష్ శంకర్ ప్లాన్ చేశాడు. ఇప్పటికే షూట్ చేసిన సన్నివేశాలను సద్వినియోగం చేసుకునే విధంగా స్క్రీన్‌ప్లే నడుపనున్నారు. తాజాగా తిరుపతిలో హరీష్ శంకర్ ఈ సినిమా గురించి కామెంట్స్ చేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం పవన్ కళ్యాణ్‌తో సినిమా గురించి దర్శకుడు హరీష్ శంకర్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ జూన్ రెండో వారంలో షూటింగ్‌ను పునః ప్రారంభించే ఉద్దేశంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. కేవలం 45 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసే విధంగా హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ ఏడాదిలో వీరమల్లు సినిమాతో పాటు ఓజీ సినిమా విడుదల కానున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాది ఆరంభంలో లేదా సమ్మర్ వరకు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలతో పవన్ ఫ్యాన్స్‌ను మెప్పిస్తాడా అనేది చూడాలి.
