పవన్ మూవీ ఆపే దమ్ము ఎవరికీ లేదు.. ఆయనో తుపాన్!: సునీల్ నారంగ్
పవన్ సినిమాను ఆపే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. అయితే హీరోలు దేవుళ్ళు లాంటి వారని కొనియాడారు.
By: Tupaki Desk | 8 Jun 2025 1:05 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు ముందు అనుకున్న రిలీజ్ తేదీకి ముందే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ బంద్ అంటూ ప్రకటన రావడం సంచలనం రేపింది. అలా ఎందుకు జరిగిందోనని ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత పలువురు నిర్మాతలు రెస్పాండ్ అయ్యి క్లారిటీ ఇచ్చారు.
ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్, నిర్మాత సునీల్ నారంగ్ కూడా ఆ విషయంపై మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము ఎవరికీ లేదని తెలిపారు. అది అసాధ్యమని చెప్పారు. ఆయన తుపాన్ లాంటి వారని దేశ ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా తనను మెచ్చుకున్నారని ఇప్పటికే జరిగిన సంఘటనను గుర్తు చేశారు.
పవన్ సినిమాను ఆపే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. అయితే హీరోలు దేవుళ్ళు లాంటి వారని కొనియాడారు. వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఏ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాతలు ఇండస్ట్రీలో చేయరని అన్నారు. థియేటర్ల బంద్ వార్త విని తాను కూడా ఆశ్చర్యానికి గురయ్యానని, సమావేశంలో పాల్గొనలేదని చెప్పారు.
150 కోట్ల జనాభా ఉన్న దేశంలో 30 నుంచి 40 మంది హీరోలు మాత్రమే ఉన్నారని నారంగ్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో హీరోల రెమ్యూనరేషన్ గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలన్నదే తమ ఆకాంక్షగా చెప్పారు. ఏ వ్యాపారమైన డిమాండ్ అండ్ సప్లయ్ మీదే ఆధారపడి ఉంటుందన్నారు.
థియేటర్స్ బంద్ వివాదంలో ఆ నలుగురు అని ఎవరు కూడా లేరని నారంగ్ అన్నారు. యజమానుల వద్దే వారి వారి థియేటర్లు ఉన్నాయని స్పష్టం చేశారు. చాలా మంది ఓనర్లు ఉన్నారని చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మొత్తం థియేటర్లలో తమ ఏషియన్ సినిమాస్ సంస్థ కింద 5 శాతానికి మించి లేవుని స్పష్టం చేశారు.
తమ దగ్గర మొత్తం 70 థియేటర్లు ఉన్నాయని, అందులో 30 గ్రౌండ్ లీజుతో ఉన్నాయని తెలిపారు. అవి కాకుండా కొన్ని మల్టీప్లెక్స్ లు మాత్రమే ఉన్నాయని అన్నారు. మొత్తం కలిపినా 5-6 శాతం కంటే ఎక్కువ ఉండవని లెక్కలతో క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్న పర్సంటేజ్ విధానం త్వరలోనే పరిష్కారం అవుతుందని అన్నారు. అయితే ఆ నలుగురు ఉన్నారన్న ప్రచారంలో సునీల్ నారంగ్ పేరు కూడా ఉన్న విషయం తెలిసిందే.
