ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలతో సినీ పెద్దల భేటీ ఏం జరగనుంది?
తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజుల క్రితం థియేటర్ల బంద్ పెద్ద చర్చకు తెరలేపిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 12 Jun 2025 12:58 PM ISTతెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజుల క్రితం థియేటర్ల బంద్ పెద్ద చర్చకు తెరలేపిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ నటించిన `హరి హర వీరమల్లు` రిలీజ్ సమయంలో ఎగ్జిబిటర్లు థియేటర్ల బంద్‌కు పిలుపునివ్వడం వివాదంగా మారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహానికి దారి తీసింది. ఈ విషయంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్ ఇండస్ట్రీపై, ఇండస్ట్రీ పెద్దలపై ఫైరల్ కావడం తెలిసిందే.
ఇండస్ట్రీకి కృతజ్ఞత లేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇంత వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని తెలుగు సినీ సంఘాలు, సంఘాల పెద్దలు కనీసం ఒక్కసారి కూడా కలవలేదని మండిపడ్డారు. కేవలం తమ సినిమాల రిలీజ్ సందర్భంగా టికెట్ రేట్లు పెంచుకునే సందర్భంగా ప్రభుత్వం ముందుకు రావడం మినహా చిత్ర రంగ అభివృద్ధి కోసం కలవడానికి రాలేవని దుయ్యబట్టారు.
మేము సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం పాటుపడుతుంటే మీరు మాత్రం మాకు ఈ విధంగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని ఫైర్ అయ్యారు. ఇకపై ఎవరూ నేరుగా ఏపీ ప్రభుత్వ వర్గాలని కలవడానికి వీళ్లేదని, సంఘాల ద్వారానే కలవాలని ఖరాకండీగా చెప్పేశారు. ఇదిలా ఉంటే ఈ నెల 15న తొలిసారి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ని కలవడానికి 30 మంది సినీ పెద్దలు రెడీ అవుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇప్పటికే ఏపీ సీఎం అపాయింట్ మెంట్‌ని సినీ పెద్దలు కోరారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వ వర్గాలు ఈ నెల 15న ముఖ్యమంత్రి కార్యాలయంలో భేటీకి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుందట. ఇందులో ఇండస్ట్రీకి చెందిన 30 మంది సినీ పెద్దలు పాల్గొననున్నారట. ఈ సందర్భంగా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక ఈ నెల 22న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో మరో భేటీ జరగనున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఇండస్ట్రీ పెద్దలతో ఎలా వ్యవహరించబోతున్నారు? ఎలాంటి ప్రశ్నలు వారిపై సంధించబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
