సెలబ్రిటీలకు పవన్ కళ్యాణ్ పిలుపు.. స్పందించిన నాని
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా సామాజిక మార్పులోనూ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేస్తున్నారు.
By: Tupaki Desk | 2 May 2026 1:57 PM ISTఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా సామాజిక మార్పులోనూ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేస్తున్నారు. పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆయన పిలుపునివ్వగా, టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వెంటనే స్పందించడం విశేషం. చెత్త నుంచి సంపదను సృష్టించే 'స్వచ్ఛ రథాల' ప్రాముఖ్యతను వివరిస్తూ నాని విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రభుత్వ కార్యక్రమానికి ఒక స్టార్ హీరో మద్దతు తెలపడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఆ వివరాలు చూద్దాం..
పవన్ పిలుపు - నాని స్పందన:
ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గ్రామాల్లో పరిశుభ్రత మెరుగుపరచడమే లక్ష్యంగా 'స్వచ్ఛ రథాలు' అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సెలబ్రిటీలను కోరగా, నాని ముందుకొచ్చారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ ఆయన ఒక వీడియో సందేశాన్ని పంచుకున్నారు. మన పారిశుద్ధ్యం-మన బాధ్యత అని చాటిచెప్పారు.
చెత్త నుంచి సంపద సృష్టి:
ఈ స్వచ్ఛ రథాల కాన్సెప్ట్ చాలా విభిన్నంగా ఉంది. కేవలం చెత్తను సేకరించడమే కాకుండా, దాని ద్వారా సంపదను సృష్టించడం ఈ పథకం ఉద్దేశం. ప్రజలు తమ ఇళ్లలోని పొడి చెత్తను ప్రభుత్వానికి ఇస్తే, దానికి బదులుగా నిత్యావసర సరుకులను పొందే వీలుంది. ఈ పద్ధతి వల్ల ప్రజలకు ఆర్థికంగా లాభం కలగడమే కాకుండా, గ్రామాలు కూడా అద్దంలా మెరిసిపోతున్నాయి.
రికార్డు స్థాయిలో గణాంకాలు:
ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ అయిందో పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించారు. ఒక్క ఏప్రిల్ నెలలోనే ఏకంగా 19 లక్షల కేజీల పొడి చెత్తను ప్రభుత్వం సేకరించింది. దీనికి బదులుగా ప్రజలకు సుమారు 3.32 కోట్ల రూపాయల విలువైన నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ గణాంకాలు చూస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య విప్లవం ఏ స్థాయిలో కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
మరింత మంది సెలబ్రిటీలకు ఆహ్వానం:
నాని చేసిన ఈ సహాయానికి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడే కాదు, ఇంతకూ ముందు చాలాసార్లు పవన్ కు నాని సపోర్ట్ గా నిలిచాడు. ఇక నాని స్పూర్తితో మరికొంత మంది సినీ మరియు ఇతర రంగాల ప్రముఖులు ముందుకు రావాలని ఆయన కోరారు. సెలబ్రిటీలు చెబితే ప్రజల్లోకి సందేశం వేగంగా వెళ్తుందని, తద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మొత్తానికి పవన్ కళ్యాణ్ దార్శనికతకు, నాని సామాజిక బాధ్యత తోడవ్వడంతో ఏపీలో స్వచ్ఛ భారత్ మిషన్ కొత్త పుంతలు తొక్కుతోంది. రాజకీయాలకు అతీతంగా మంచి కార్యక్రమాల కోసం సెలబ్రిటీలు ఇలా కలిసి రావడం శుభపరిణామం అంటున్నారు ఫాన్స్. ఇక ఈ 'స్వచ్ఛ రథాలు' భవిష్యత్తులో మరిన్ని గ్రామాలను ఆదర్శంగా మారుస్తాయని ప్రజలు భావిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ దిశగా సాగుతున్న ఈ ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం.
