Begin typing your search above and press return to search.

పవన్ మూవీ.. సురేందర్ రెడ్డి అలా చేయకపోతే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో దర్శకుడు సురేందర్ రెడ్డి చేయనున్న ప్రాజెక్ట్ టాలీవుడ్‌ లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

By:  M Prashanth   |   22 March 2026 8:30 AM IST
పవన్ మూవీ.. సురేందర్ రెడ్డి అలా చేయకపోతే..
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో దర్శకుడు సురేందర్ రెడ్డి చేయనున్న ప్రాజెక్ట్ టాలీవుడ్‌ లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు స్టైలిష్ కమర్షియల్ ఎంటర్టైనర్లతో టాప్ డైరెక్టర్లలో స్థానం సంపాదించిన సురేందర్ రెడ్డి.. గత కొన్నేళ్లుగా మాత్రం వరుస ఫ్లాప్స్‌ తో వెనుకబడ్డారు. కిక్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, అదే సినిమాకు సీక్వెల్‌ గా వచ్చిన కిక్-2తో భారీ డిజాస్టర్‌ ఎదుర్కొన్నారు.

ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న సురేందర్ రెడ్డి, రామ్ చరణ్ తో ధృవ సినిమాను తెరకెక్కించి హిట్ అందుకున్నారు. అయితే అది తమిళ రీమేక్ కావడంతో పూర్తి స్థాయి ఒరిజినల్ క్రెడిట్ ఆయనకు దక్కలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తర్వాత మెగాస్టార్ చిరంజీవి తో రూపొందించిన సైరా నరసింహ రెడ్డి భారీ అంచనాలతో విడుదలైంది.

విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, పాన్ ఇండియా స్థాయిలో ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇక ఇటీవల అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ చిత్రం అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలవడంతో సురేందర్ రెడ్డి కెరీర్‌ పై ప్రశ్నలు తలెత్తాయి. అలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో ఆయన చేయబోతున్న కొత్త సినిమా కీలకంగా మారింది.

స్టార్ హీరో పవన్ కళ్యాణ్‌ తో మూవీ అనగానే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే సమయంలో ఆ ప్రాజెక్ట్ సురేందర్ రెడ్డికి కమ్ బ్యాక్ మూవీగా నిలుస్తుందా అన్న చర్చ ఇండస్ట్రీలో సాగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్, సురేందర్ రెడ్డి స్టైలిష్ టేకింగ్ కలిస్తే ఒక పవర్‌ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ రావొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే సురేందర్ రెడ్డి సినిమాల్లో స్టైలిష్ ప్రెజెంటేషన్, హీరో ఎలివేషన్స్ ప్రధానంగా ఉంటాయి. కానీ ప్రస్తుత ట్రెండ్‌ ను పరిశీలిస్తే, కేవలం ఎలివేషన్స్‌ తో సరిపోదని స్పష్టమవుతోంది. ప్రేక్షకులు ఇప్పుడు స్ట్రాంగ్ స్టోరీ, ఎమోషన్స్, కంటెంట్‌ కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల విజయాలు సాధించిన చిత్రాలు కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌తో తెరకెక్కించే కొత్త సినిమా విషయంలో సురేందర్ రెడ్డి మరింత జాగ్రత్తగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.

మాస్ అంశాలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కథను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ కు సరిపోయే కథతో పాటు భావోద్వేగానికి కూడా ప్రాధాన్యత ఇస్తేనే సినిమా విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేకుంటే కష్టమనే చెప్పాలి. అయితే అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో సాగే పక్కా మాస్ ఎంటర్టైనర్‌ గా సినిమా రూపుదిద్దుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎస్ఆర్ టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై నిర్మాత రామ్ తాళ్లూరి ఆ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కే అవకాశముందని సమాచారం.