హైదరాబాద్ స్కూల్‌లో చేరిన పవన్ కుమారుడు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ఎనిమిదేళ్ల కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ చదువుకుంటున్న సింగపూర్ స్కూల్ అగ్నిప్రమాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 15 Jun 2025 12:56 PM ISTఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ఎనిమిదేళ్ల కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ చదువుకుంటున్న సింగపూర్ స్కూల్ అగ్నిప్రమాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ తీవ్ర అస్వస్థతకు గురై చికిత్సతో కోలుకున్నాడు. తనయుడి పరిస్థితి తెలుసుకుని హుటాహుటీన బయల్దేరి వెళ్లిన పవన్, ఆ తర్వాత తదుపరి స్కూలింగ్ లొకేషన్ గురించి సీరియస్ గా ఆలోచించినట్టే కనిపిస్తోంది. ఇటీవలే మార్క్ తో కలిసి విమానాశ్రయం నుంచి వెళుతూ కనిపించారు పవన్.
ఇంతలోనే ఇప్పుడు మార్క్ శంకర్ ను పటాన్ చెరులోని ఇక్రిసాట్ క్యాంపస్‌లోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌లో చేర్పించారని తెలిసింది. ఇటీవలే తనయుడి అడ్మిషన్‌ను ఖరారు చేయడానికి పాఠశాలకు వెళ్లిన పవన్ ఇక్రిసాట్ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించారు. కొద్ది సమయం అక్కడ గడిపారు. పాఠశాల గురించి తెలుసుకున్నారు.
సింగపూర్ ప్రమాద ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ తన కుమారుడు మార్క్‌ను హైదాబాద్ లోనే ఉంచాలని నిర్ణయించుకున్నారు. మార్క్ భద్రత సంరక్షణ విషయంలో పవన్ చాలా సీరియస్ గా ఉన్నారు. తనయుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ లో హై క్వాలిటీ విద్యకు ఆస్కారం ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలు ఈ స్కూల్ ప్రత్యేకత. భారతదేశం సహా విదేశాల నుండి ఇక్కడ చాలా మంది విద్యనభ్యసిస్తున్నారు. పవన్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా తన కుటుంబం విషయంలో అలసత్వం ప్రదర్శించరు అనడానికి ఈ ఉదాహరణ చాలు.
