ఆ సినిమా చేసి ఉంటే రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు
తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా కెరీర్ ను మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్, ఆయన్ను మించి ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
By: Tupaki Desk | 1 Jun 2025 4:15 PM ISTతెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా కెరీర్ ను మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్, ఆయన్ను మించి ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కేవలం పవన్ స్క్రీన్ పై కనిపిస్తే చాలు సినిమా రిజల్ట్ తో సంబంధం లేదనే స్థాయికి ఆయన చేరుకున్నారు. అలాంటి పవన్ టాలీవుడ్ లో హీరోగా టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడే సినిమాలను వద్దనుకుని రాజకీయాల్లోకి వెళ్లాడు.
కానీ తర్వాత తన అవసరాల కోసం డబ్బు కావాలని, తనకు సినిమాలు తప్ప ఏమీ తెలియదని మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుని సినిమాల్లో నటిస్తూ, అటు రాజకీయాలను, ఇటు సినిమాలనీ రెండింటినీ మేనేజ్ చేస్తూ వచ్చాడు. అయితే పవన్ సినిమాల్లో ఉన్నప్పుడు తానే దర్శకత్వం వహించి జానీ అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అందులో ఫ్యాన్ మూమెంట్స్ చాలానే ఉంటాయి.
జానీ సినిమా తర్వాత పవన్ మరో సినిమాను డైరెక్ట్ చేసింది లేదు. వాస్తవానికి సత్యాగ్రహి పేరుతో పవన్ ఓ సినిమాను డైరెక్ట్ చేయాలనే ఆలోచనతో మొదలుపెట్టాడు కానీ కొన్ని కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది. ఖుషి సినిమాను నిర్మించిన ఏఎం రత్నమే సత్యాగ్రహికి కూడా ప్రొడ్యూసర్. అంతా ఓకే అనుకుని పూజా కార్యక్రమాలు కూడా చేశాక అనుకోకుండా ఈ సినిమా ఆగిపోయింది.
ఇక అసలు విషయానికొస్తే పవన్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే తాను కమిట్ అయిన సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగానే రీసెంట్ గా వీరమల్లు సినిమాను పూర్తి చేశాడు. ఇదిలా ఉంటే రీసెంట్ గా పవన్, వీరమల్లు నిర్మాత రత్నం మధ్య సత్యాగ్రహి సినిమా టాపిక్ వచ్చినట్టు రీసెంట్ గా వీరమల్లు ప్రమోషన్స్ లో రత్నం వెల్లడించారు.
ఒకవేళ తాను సత్యాగ్రహి సినిమాను పూర్తి చేసి ఉన్నా, లేదా నిర్మాతగా మీరొచ్చి ఆ సినిమా చేయాల్సిందే అని పట్టుబట్టినా తాను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదని, ఆమిర్ ఖాన్ లా తాను కూడా డైరెక్టర్ గానే సినిమాలు తీసుకుంటూ బిజీ అయ్యేవాడినని పవన్ తనతో అన్నారని రత్నం చెప్పారు. ఆ టైమ్ లో పవన్ సత్యాగ్రహిని చేయడానికి ఆసక్తిగా లేకపోవడం వల్లే ఆ సినిమాను పూర్తి చేయలేదని, ఈ విషయంలో తాను కూడా పవన్ పై ఒత్తిడి తీసుకురాలేదని రత్నం అన్నారు. అయితే పవన్ కు సత్యాగ్రహిపై అంత నమ్మకమున్నప్పుడు ఎందుకు ఆ సినిమాను సడెన్ గా ఆపేశాడనేది మాత్రం ఆయనకే తెలియాలి.
