వీరమల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా హరిహర వీరమల్లు. గత ఐదేళ్లుగా ఈ సినిమా ప్రొడక్షన్ లోనే ఉంది.
By: Tupaki Desk | 4 May 2025 6:21 AMపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా హరిహర వీరమల్లు. గత ఐదేళ్లుగా ఈ సినిమా ప్రొడక్షన్ లోనే ఉంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజవాల్సింది కానీ వీరమల్లు షూటింగే ఇంకా పూర్తి కాలేదు. కనీసం సినిమా ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు రిలీజవుతుందనే విషయాలను కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు.
మొదట్లో వీరమల్లు మూవీ సెట్స్ పైకి వెళ్లినప్పుడు విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఇప్పుడు కనీస బజ్ కూడా లేదు. ఇన్నేళ్ల పాటూ సినిమా నిర్మాణంలో ఉండటంతో పాటూ పలుమార్లు రిలీజ్ వాయిదా పడటమే దానికి కారణం. ఆఖరికి పవన్ ఫ్యాన్సే ఈ సినిమా గురించి, రిలీజ్ గురించి ట్రోల్స్ చేస్తున్నారంటే వీరమల్లు పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
అసలు పవన్ తిరిగి ఎప్పుడు షూటింగ్ లో జాయిన్ అవుతారు? ఎప్పుడు వీరమల్లు పూర్తవుతుంది? రిలీజ్ ఎప్పుడవుతుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్ననేపథ్యంలో వీరమల్లు షూటింగ్ గురించి ఓ అప్డేట్ వినిపిస్తోంది. ఆదివారం నుంచే పవన్ కళ్యాణ్ వీరమల్లు సెట్స్ లో అడుగుపెడుతున్నారని తెలుస్తోంది.
వీలైనంత త్వరగా ఆయన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసి తన బాధ్యతను నిర్వర్తించాలని చూస్తున్నాడట పవన్. పవన్ ఐదారు రోజుల కాల్షీట్స్ ఇస్తే మొత్తం షూటింగ్ పూర్తయ్యే నేపథ్యంలో ఇవాళ నుంచి వారం రోజుల పాటూ పవన్ తన డేట్స్ ను అడ్జస్ట్ చేసి వీరమల్లు షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నాడట. ఇదే నిజమైతే పవన్ ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి.
ఆల్రెడీ మేకర్స్ మే 9న వీరమల్లును రిలీజ్ చేయాలని భావించారు. కానీ మే 9న రిలీజ్ ఎట్టి పరిస్థితుల్లో కుదరదని క్లారిటీ వచ్చింది. షూటింగే మరో వారం రోజుల పాటూ ఉందంటే, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ కు టైమ్ బాగానే పడుతుంది. అన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని మే 30న సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.