నిర్మాత రత్నంకు ఊరటనిచ్చిన పవన్
పవన్ చేతిలో ప్రస్తుతం పలు ప్రాజెక్టులుండగా వాటిలో అన్నింటికంటే ముందు మొదలైన సినిమా హరి హర వీరమల్లు.
By: Tupaki Desk | 4 Jun 2025 2:44 PM ISTటాలీవుడ్ లో ఒకప్పుడు భారీ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా రికార్డులు క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం ఏపీ రాజకీయాలపైనే ఉంది. రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు సినిమాలు చేసేంత తీరిక ఉండటం లేదు. అందుకే ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయడానికి కూడా పవన్ కు వీలు పడటం లేదు.
పవన్ చేతిలో ప్రస్తుతం పలు ప్రాజెక్టులుండగా వాటిలో అన్నింటికంటే ముందు మొదలైన సినిమా హరి హర వీరమల్లు. ఎప్పుడో కరోనాకు ముందు మొదలైన ఈ సినిమా ప్రొడక్షన్ లోనే నాలుగేళ్లుంది. దీంతో వీరమల్లు సినిమాకు నిర్మాతకు బడ్జెట్ విపరీతంగా పెరిగింది. మొత్తానికి ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 12న రిలీజ్ అవుతుందన్నారు.
హమ్మయ్యా ఇన్నేళ్లకు వీరమల్లు రిలీజ్ కు నోచుకుందని సంతోషించేలోపు ఇప్పుడు మరోసారి ఈ సినిమా వాయిదా పడుతుంది. సీజీ వర్క్ ఇంకా పూర్తవనందున వీరమల్లుని జులైకి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. దీంతో నిర్మాతకు మరోసారి తలనొప్పి మొదలైంది. అసలే సినిమాకు భారీ ఖర్చైందనుకుంటుంటే ఇప్పుడు మరోసారి సినిమా వాయిదా పడటం వల్ల నిర్మాతకు ఆ ఖర్చు ఇంకాస్త పెరగనుంది.
ఐదేళ్లుగా పవన్ కళ్యాణ్‌ను, వీరమల్లు సినిమాను మాత్రమే నమ్ముకుని దానిపైనే ఉన్న నిర్మాత రత్నం నష్టాన్ని గుర్తించి పవన్ తన వంతు సాయాన్ని చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పవన్ వీరమల్లు కోసం తీసుకున్న అడ్వాన్స్ రూ. 11 కోట్లను వెనక్కి ఇవ్వనున్నాడని సమాచారం. ఇది నిర్మాత రత్నంకు ఎంతో ఊరటనిచ్చే విషయం.
ఇప్పటివరకు వీరమల్లు కోసం పెట్టుబడి పెట్టడం తప్పించి లాభాలను అందుకోని ఈ సినిమాకు పవన్ తీసుకున్న అడ్వాన్సును కూడా వెనక్కి ఇవ్వడమంటే రత్నంకు ఇదెంతో పెద్ద విషయం. మామలూగా ఒక్కో సినిమాకీ రూ.75 కోట్లు తీసుకునే పవన్ ఈ సినిమా కోసం రూ.50 కోట్లే తీసుకోనుండగా, అందులో అడ్వాన్సుగా రూ.11 కోట్లు తీసుకున్నాడట. ఇప్పుడు ఆ అడ్వాన్స్ ను కూడా పవన్ తిరిగి ఇవ్వనున్నాడని తెలుస్తోంది.
