ఆ రోజు పవన్ లోని రియల్ హీరోను కళ్లారా చూశా
తొలి ప్రేమ ఇంటర్వెల్ లో వచ్చే యాక్సిడెంట్ సీన్ షూటింగ్ జరుగుతున్న రోజుల్లో ఆ సీన్ ను షూట్ చేయడానికి అన్ని ఏర్పాటు పూర్తి చేశారట.
By: Tupaki Desk | 13 Jun 2025 5:29 PM ISTహీరోలు రెండు రకాలుంటారు. రీల్ లైఫ్ హీరోలు ఓ రకం, రియల్ లైఫ్ హీరోలు మరో రకం. రీల్ లైఫ్ హీరోలంటే కేవలం సినిమాల్లో నటిస్తూ, బిగ్ స్క్రీన్ కే పరిమితమవుతారు. కానీ రియల్ లైఫ్ హీరోలంటే నిజ జీవితంలో ఎంతో మందిని కాపాడుతూ, వాళ్ల జీవితాలను సేవ్ చేస్తూ ఉంటారు. రీల్ లైఫ్ హీరోలు కూడా కొంతమంది రియల్ లైఫ్ లో హీరోలైన సందర్భాలుంటాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అలా ఓ సందర్భంలో రియల్ హీరోగా నిలిచారు. అది కూడా తన కెరీర్ స్టార్టింగ్ రోజుల్లో. పవన్ కెరీర్ ను మొదలుపెట్టిన తొలి నాళ్లలో వచ్చిన తొలిప్రేమ సినిమా షూటింగ్ టైమ్ లో పవన్ లోని రియల్ హీరో బయటికి వచ్చాడని, ఆ రోజు తాను నిజంగా పవన్ లో ఓ హీరోని చూశానని సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు ఓ సందర్భంలో వెల్లడించాడు.
తొలి ప్రేమ ఇంటర్వెల్ లో వచ్చే యాక్సిడెంట్ సీన్ షూటింగ్ జరుగుతున్న రోజుల్లో ఆ సీన్ ను షూట్ చేయడానికి అన్ని ఏర్పాటు పూర్తి చేశారట. ఆ సీన్ కు సంబంధించిన క్లోజప్స్ అన్నీ పవన్, కీర్తి రెడ్డిపై తీసుకుని, మిగిలింది వారి డూప్స్ తో చేయాలని ప్లాన్ చేశారట. షూట్ లో భాగంగా పవన్, కీర్తి రెడ్డి డూప్‌లను కార్లో కూర్చోబెట్టారట. కారుకు కట్టిన రోప్ ను డైరెక్టర్ పలుమార్లు చెక్ చేసుకోగా, సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు ఆ షాట్ కోసం కెమెరాను రెడీ చేసుకున్నాడట.
యాక్షన్ చెప్పగానే సీన్ మొదలైంది. కానీ ఎవరూ ఊహించని విధంగా కారుకు కట్టిన రోప్ తెగడంతో కారు లోయలోకి పడిపోయిందట. అది చూసిన అందరూ షాకయ్యారట. సెట్ మొత్తం ఒక్కసారిగా అరుపులు, కేకలతో మార్మోగిందని, అది చూసి షాకైన చోటా పక్కనే ఉన్న పవన్ కు ఏదో చెప్పబోయి చూస్తే పవన్ ఆ కుర్చీలో లేడని, కారులోని వారిని కాపాడటానికి పవన్ పరిగెత్తుకుంటూ లోయ వైపు పరిగెడుతున్నాడని, అది చూసి తాను షాకయ్యానని, ఆ రోజు పవన్ లోని రియల్ హీరోను తాను కళ్లారా చూసినట్టు చోటా చెప్పాడు.
ఈ విషయం తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్ తమ హీరో రియల్ హీరో అని కెరీర్ స్టార్టింగ్ లోనే ప్రూవ్ చేసుకున్నాడని చెప్తూ సంబరపడిపోతున్నారు. కేవలం ఈ విషయమే కాదు, ఆపదలో ఉన్నామని తన వద్దకు వెళ్లిన ఎవరికైనా పవన్ తనకు తోచిన సాయం చేస్తూ ఉంటాడని, పవన్ ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలను కాపాడారని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు.
