నాపై కుట్రలకు నా నిర్మాతలు నష్టపోయారు: పవన్ కల్యాణ్
ఓవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్, తన సినిమా హరి హర వీర మల్లు ప్రచారంలో ఉధృతంగా పాల్గొంటున్నారు.
By: Tupaki Desk | 23 July 2025 9:08 AM ISTఓవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్, తన సినిమా హరి హర వీర మల్లు ప్రచారంలో ఉధృతంగా పాల్గొంటున్నారు. పవర్ స్టార్‌లో మునుపెన్నడూ లేని ఫైర్ కనిపిస్తోంది. ఈ మంగళవారం నాడు ఆయన మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో మీడియా ప్రతినిథులతో మాట్లాడారు.
తనపైనా తన సినిమాలపైనా గత ప్రభుత్వం దాష్టీకానికి దిగిందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. నాపై కుట్రల కారణంగా నా నిర్మాతలు నష్టపోయారని పవన్ కల్యాణ్ ఆవేదన చెందారు. వీరమల్లు గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా ప్రత్యేకమైనదని, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తెరకెక్కించామని తెలిపారు. ప్రకృతి విపత్తులు, మానవ విపత్తులు, రాజకీయ విపత్తులను తట్టుకొని వీరమల్లు నిలబడ్డాడు. నిర్మాతలు చాలా విషయాల్లో గుండె ధైర్యంతో నిలబడ్డారు. ఇంత ధైర్యంగా నిలబడిన నిర్మాతకు అండగా నిలబడటం నా కర్తవ్యంగా భావించాను. ప్రమోషన్లు చేయడం నా బాధ్యత అని పవన్ అన్నారు.
ఈ సినిమా చేస్తున్నపుడు చాలా కోణాల్లో ఇబ్బందులు పడ్డారు కదా? అని ప్రశ్నించగా, వీరమల్లు సినిమా నిర్మాణ సమయంలో రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని అన్నారు. విశాఖలో నన్ను హోటల్ లో నిర్భందించడం కీలక పరిణామం.. అలాగే నా సినిమా టిక్కెట్లను రూ.10, రూ.15లకు తగ్గించి గత పాలకులు ఇబ్బందులు పెట్టారు. సీమలో ఎవరికైనా పగలు ఉంటే చీని చెట్లను నరికి వారి ఆర్థిక మూలాలపై దెబ్బతీసే అలవాటు ఉన్న గత పాలకుల కారణంగా నాతో సినిమాలు చేసిన నిర్మాతలు చాలా నష్టపోయారు. నన్ను పూర్తిగా దెబ్బతీయడానికి చాలా రకాలుగా ప్రయత్నించారు. అన్నిటినీ అధిగమించి ఇప్పుడు ఈ చిత్రం బయటకు రావడం ఆనందంగా ఉందని పవన్ అన్నారు. వీరమల్లు చిత్రీకరణ సమయంలో అన్ని సంఘర్షణలు అనుభవించామని అన్నారు.
ప్రస్తుత టికెట్ పెంపుపైనా పవన్ ప్రస్థావించారు.. అన్ని సినిమాలతో పాటు తన సినిమాకి టికెట్ ధరను పెంచారని, నా కోసం ప్రత్యేకంగా పెంచలేదని పవన్ అన్నారు.. నిర్మాతల కష్టం, వారి శ్రమ అన్ని పరిగణనలోకి తీసుకొని సినిమాలకు టిక్కెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇస్తోందన్నారు. వీరమల్లు చిత్రం ఈ గురువారం థియేటర్లలోకి విడుదలవుతోంది.
