Begin typing your search above and press return to search.

వీరమల్లు ట్రైలర్‌కి పవన్‌ స్పందన ఏంటంటే..!

పవన్‌ కళ్యాణ్‌ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చాలా నెలలుగా వెయిట్‌ చేస్తున్న హరి హర వీరమల్లు సినిమా ట్రైలర్‌ రిలీజ్‌కి సమయం దగ్గర పడింది.

By:  Tupaki Desk   |   2 July 2025 1:37 PM IST
వీరమల్లు ట్రైలర్‌కి పవన్‌ స్పందన ఏంటంటే..!
X

పవన్‌ కళ్యాణ్‌ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చాలా నెలలుగా వెయిట్‌ చేస్తున్న హరి హర వీరమల్లు సినిమా ట్రైలర్‌ రిలీజ్‌కి సమయం దగ్గర పడింది. మరికొన్ని గంటల్లో యూట్యూబ్‌ ద్వారా ప్రపంచం ముందుకు రాబోతున్న ఈ ట్రైలర్‌కి ఖచ్చితంగా మంచి మార్కులు పడుతాయనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. గత నెలలోనే సినిమా విడుదల కావాల్సి ఉండగా, వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ ఆలస్యం కారణంగా వాయిదా పడింది. దాంతో ట్రైలర్‌ సైతం ఇన్నాళ్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు సినిమాను జులై 24న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో ట్రైలర్‌ను రేపు అంటే జులై 3న విడుదల చేయబోతున్నారు.

వీరమల్లు ట్రైలర్‌ను రేపు ఉదయం 11.10 గంటలకు విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ముందస్తు గానే రెడీ చేశారు. విడుదల సమయంలో ఎలాంటి గందరగోళం ఉండకూడదు అనే ఉద్దేశంతో రెండు రోజుల ముందుగానే హరి హర వీరమల్లు ట్రైలర్‌ను రెడీ చేశారని తెలుస్తోంది. ఇటీవలే ఫైనల్‌ కట్‌ను, మ్యూజిక్‌తో సహా పవన్‌ కళ్యాణ్‌ చూశారట. ట్రైలర్‌ చూసిన పవన్‌ కళ్యాణ్‌ సంతృప్తి వ్యక్తం చేశారని, సినిమా ఔట్‌ పుట్‌ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నారని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ట్రైలర్‌ కట్‌కి పవన్ కళ్యాణ్ నుంచి యూనిట్‌ కి అభినందనలు దక్కినట్లు తెలుస్తోంది.

పవన్‌ కళ్యాణ్‌ మొదటి సారి చేసిన పీరియాడిక్ డ్రామా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా రూపొందింది. క్రిష్ దర్శకత్వంలో ప్రారంభం అయిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల చేతులు మారింది. నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా పూర్తి అయింది. సినిమా టైటిల్‌ కార్డ్స్ లో క్రిష్‌, జ్యోతికృష్ణ అని వేస్తున్నారు. సాధారణంగా మధ్యలో వెళ్లి పోయిన దర్శకుడికి క్రెడిట్స్ ఇవ్వరు. ఆ దర్శకుడు కూడా క్రెడిట్స్ ను తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించడు. కానీ క్రిష్ మాత్రం పవన్‌ కళ్యాణ్ మూవీ కావడంతో క్రెడిట్స్ తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించాడు. సినిమాలో వచ్చే యాక్షన్‌ సన్నివేశాలు, ముఖ్యంగా కొన్ని దొంగతనాల సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని అంటున్నారు. ఈ సినిమా ప్రారంభం అయ్యి చాలా కాలం అయింది. మూడు ఏళ్లుగా అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల మొదట షూటింగ్‌ జరగలేదు, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు పవన్‌ డేట్లు ఇవ్వడంతో షూటింగ్‌ పూర్తి చేసిన మేకర్స్ ఈ నెల చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. పవన్‌ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రిలీజ్ కాబోతున్న సినిమా కావడంతో అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది.