ఆస్కార్ కమిటీలో కమల్‌హాసన్.. పవన్ అభినందనలు
కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించిన కమల్ హాసన్ యూనివర్శల్ హీరోగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.
By: Tupaki Desk | 29 Jun 2025 11:30 AM ISTకెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించిన కమల్ హాసన్ యూనివర్శల్ హీరోగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన భారతీయ సినిమాకు చేసిన సేవలకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోవడమే గాక, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలను లెక్కకు మిక్కిలిగా అందుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ అందుకున్న మేటి కళాకారుడు. మూడుసార్లు ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక నంది అవార్డులను అందుకున్నారు. ఇక కెరీర్ లో లెక్కలేనన్ని ఫిలింఫేర్ లు, ప్రపంచదేశాల్లో అత్యున్నత పురస్కారాలు అందుకున్న మేటి ప్రతిభావంతుడు.
అయితే కాస్త ఆలస్యంగా అయినా కమల్ హాసన్ ని ఆస్కార్ (అకాడెమీ అవార్డుల) కమిటీ గుర్తించింది. ఎట్టకులకు భారతీయ సినిమా దిగ్గజం కమల్ హాసన్‌ను అకాడమీ అవార్డ్స్ 2025 కమిటీ సభ్యుడిగా ఎంపిక చేశారు. ఈ గుర్తింపు ఆయనకు ఎప్పుడో దక్కాల్సింది. కానీ ఇప్పటికి సాధ్యమైంది. ప్రపంచ సినిమాకు ఆయన చేసిన విశేష కృషిని సెలబ్రేట్ చేసుకునే అరుదైన సందర్భమిది. ప్రస్తుతం ఆయనకు అభిమానులు, సహనటులు, ఇతర రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కమల్ హాసన్ కి ఆస్కార్ కమిటీ పిలుపు అందిందని తెలిసిన వెంటనే మనస్ఫూర్తిగా అభినందించిన వారిలో టాలీవుడ్ పవర్ స్టార్, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఈ క్షణం భారతీయ చిత్ర పరిశ్రమకు గర్వకారణమైన క్షణం అని పవన్ ఆనందం వ్యక్తం చేసారు. కమల్ కేవలం నటుడు మాత్రమే కాదు.. పూర్తి స్థాయి ఫిలింమేకర్ అని అన్నారు. `` రచన, దర్శకత్వం, నిర్మాణం, పాటలు సహా సినిమాలోని ప్రతి అంశంపై ఆయన నైపుణ్యాన్ని ప్రశంసించారు. కమల్ హాసన్ ఆరు దశాబ్దాల విశిష్ట కెరీర్‌ను ప్రస్థావిస్తూ, పవన్ ఆయనను నిజమైన కళాఖండంగా అభివర్ణించారు. మిస్టర్ హాసన్ ప్రభావం జాతీయ సరిహద్దులకు మించి విస్తరించింది. నటుడిగా, కథకుడిగా , దర్శకుడిగా ఆయన ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞ, దశాబ్దాల అనుభవం భారతీయ సినిమా సహా ప్రపంచ సినిమాపై శాశ్వత ప్రభావాన్ని చూపింద``ని పవన్ ప్రశంసా పత్రంలో రాసారు.
కమల్ హాసన్ కి మనస్ఫూర్తిగా తన శుభాభినందనలు తెలియజేసారు. లెజెండరీ కమల్ హాసన్ ప్రపంచ సినిమాకు మరిన్ని సంవత్సరాలు అర్థవంతమైన కృషి చేయాలని ఆకాంక్షించారు. విశ్వనటుడిపై పవర్ స్టార్ లేఖ ఇప్పుడు అభిమానుల్లో పెద్ద చర్చగా మారింది. కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా కమల్ హాసన్ నటవిశ్వరూపాన్ని ప్రజలు ప్రశంసించారు.
