భోగి పోస్ట్.. పవన్ ఫ్యూచర్ ప్లానేంటి?
టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ ప్లాన్ పై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 15 Jan 2026 1:02 AM ISTటాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ ప్లాన్ పై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది. అటు సినిమాలు, ఇటు పాలిటిక్స్ ను ఒకే రేంజ్ లో ముందుకు తీసుకెళ్లే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. నటుడిగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా యాక్టివ్ గా ఉండాలనే ఆలోచనలో పవన్ ఉన్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. గత కొంతకాలంగా ఆ విషయాన్ని పరోక్షంగా చెబుతూ వస్తున్నారు పవన్.
ఇప్పుడు భోగి సందర్భంగా జరిగిన కీలక భేటీతో ఆ చర్చలకు మరింత బలం చేకూర్చారు. తాజాగా పవన్ కళ్యాణ్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, ప్రముఖ నిర్మాత విశ్వ ప్రసాద్ ను కలిశారు. ఆ మీట్ లో రాబోయే రోజుల్లో చేయబోయే సినిమాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే అంశం, అలాగే పవన్ నటుడిగా కొన్ని సినిమాల్లో నటించే అవకాశాలపై మాట్లాడినట్లు తెలుస్తోంది.
ఆ భేటీకి సంబంధించిన విషయాలను పవన్ ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. “భోగి అనే శుభ రోజున కొత్త ప్రారంభాలకు నాంది పలుకుతూ, రాబోయే ప్రాజెక్టులపై ఇప్పటికే జరిగిన చర్చలు ముందుకు తీసుకెళ్తున్నాం” అని పేర్కొంది. దీంతో ఆ పోస్ట్ వైరల్ గా మారి కొత్త చర్చలకు దారితీసింది. నిజానికి పవన్ ఇప్పటికే ఎస్ఆర్‌టీ ఎంటర్టైన్మెంట్స్ తో మూవీ చేస్తున్నట్లు ఇటీవల అనౌన్స్మెంట్ వచ్చింది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి ఆ సినిమాను నిర్మించనున్నారు. పవన్ జనసేన పార్టీలో చురుకైన నేతగా పేరొందిన ఆయన.. పవన్ తో మూవీ చేయనున్నారు. అదే సమయంలో ప్రస్తుతం కేవీఎన్ ప్రొడక్షన్స్ కూడా పవర్ స్టార్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆ బ్యానర్ ఇప్పటికే పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ సంస్థతో పవన్ చేయనున్నారని వినికిడి.
అయితే ఇప్పుడు విశ్వప్రసాద్ తో భేటీ ప్రకారం.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పవన్ కలిసి పని చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ బ్యానర్ తో కూడా ప్రాజెక్ట్ ఖరారయ్యే సూచనలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అది నటుడిగా.. లేక సహ నిర్మాతగా అన్నది క్వశ్చన్ మార్క్. కానీ పాలిటిక్స్ వల్ల బిజీగా ఉండటం వల్ల నటుడిగా చాలా సినిమాలు చేయకుండా, ఎంపిక చేసిన ప్రాజెక్టులకే పరిమితం కావాలనే ఆలోచనలో ఉన్నారట.
అదే సమయంలో పవన్ నిర్మాతగా చురుగ్గా ఉండాలని భావిస్తున్నారు. కొందరు నిర్మాతలతో కలిసి సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలా అయితే సినిమాలపై ఆసక్తి కొనసాగిస్తూనే, రాజకీయ బాధ్యతలకు ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చనే యోచనలో ఉన్నారని వినికిడి. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలను పవన్ తీసుకుంటారో వేచి చూడాలి.
