'అసుర హననం' ఆస్కార్‌కి వెళుతుందా సర్?
యుద్ధానికి ముందు.. యుద్ధం జరిగేప్పుడు.. యుద్ధం వెలిసాక.. ఈ మూడు సందర్భాల్లో ఉద్రిక్తతను వ్యక్తం చేసే మంచి థీమ్ ఉన్న రీరికార్డింగ్ అవసరం.
By: Tupaki Desk | 21 May 2025 10:25 AM ISTయుద్ధానికి ముందు.. యుద్ధం జరిగేప్పుడు.. యుద్ధం వెలిసాక.. ఈ మూడు సందర్భాల్లో ఉద్రిక్తతను వ్యక్తం చేసే మంచి థీమ్ ఉన్న రీరికార్డింగ్ అవసరం. కొన్నిసార్లు రౌద్రరసాన్ని ఆవిష్కరించే పాటలను కూడా బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుంటారు. ఈ రెండో కేటగిరీలో మరకతమణి ఎం.ఎం.కీరవాణి ఇప్పటికే చాలా సృజనాత్మకతను ప్రదర్శించారు. వారియర్ కథతో రూపొందించిన బాహుబలి చిత్రంలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ లో గూస్ బంప్స్ తెప్పించేందుకు కీరవాణి చాలా వరకూ ప్రయత్నించారు.
ఇప్పుడు అలాంటి ఒక సన్నివేశానికి ముందు యుద్ధాన్ని స్ఫురించేలా థీమ్ మ్యూజిక్ ని అందించాలి. అలాంటి అవకాశం వస్తే, నిపుణుడైన ఎం.ఎం.కీరవాణి అవకాశాన్ని ఛేజార్చుకుంటారా? ఇప్పుడు పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు కోసం అలాంటి సందర్భం వచ్చింది. ఈ సందర్భానికి తగ్గట్టు `అసుర హననం' అంటూ సాగే గీతాన్ని రచయితలు అందించగా, దానికి ట్యూన్ కట్టారు కీరవాణి. మరికాసేపట్లో ఈ పాట విడుదల కానుండగా పవన్- కీరవాణి అనుబంధానికి సంబంధించిన ఒక వీడియో అంతర్జాలంలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఎం.ఎం.కీరవాణి స్టూడియోని వ్యక్తిగతంగా విజిట్ చేసిన పవన్ కల్యాణ్ కొంత సమయాన్ని స్టూడియోలో గడిపారు. కీరవాణిని శాలువాతో సత్కరించి అభినందించారు. `అసుర హననం..' పాట సంగీతాన్ని పవన్ ప్రశంసించారు. ఈ పాటను ఇప్పటికే 50 సార్లు విన్నానని కీరవాణితో చెప్పారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన స్టూడియోకి విచ్చేయడంతో కీరవాణి సైతం ఎంతో ఉద్వేగంగా కనిపించారు. మరకతమణి ప్రత్యేకంగా ప్రింట్ చేసి దాచుకున్న తనకు ఎంతో ఇష్టమైన చిన్న కథల పుస్తకాన్ని పవన్ కి కానుకగా ఇచ్చారు. అలాగే పవన్ కల్యాణ్ అభిరుచి గురించి తనకు ముందే తెలుసునని గుర్తు చేస్తూనే, ఒక వయోలిన్ కూడా అతడి చేతికి అందించారు. అంతిమంగా పవన్ కల్యాణ్ కీరవాణిని శాలువాతో సత్కరించే ముందు, ఆర్.ఆర్.ఆర్ నాటు నాటుతో ఆస్కార్ ని భారతదేశానికి తీసుకువచ్చిన కీరవాణిని ప్రశంసించడమే గాక.. ఆస్కార్ ప్రతిమను తాకాలని ఉందని అడగడం ఉద్విగ్నతను కలిగిస్తుంది. ఇవన్నీ అందమైన జ్ఞాపకాలుగా పదిలం చేసుకునేలా వారి మధ్య అభిమానం అందరినీ ఆకర్షించింది. అయితే ఎంతో హైప్ తెచ్చిన `అసుర హననం` కూడా ఒరిజినల్ స్కోర్ కోసం ఆస్కార్ కి వెళితే బావుంటుందని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
పవన్ సినిమా `హరి హర వీర మల్లు' జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. క్రిష్ జాగర్లముడి - జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్ కథానాయిక. ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మించారు.
