Begin typing your search above and press return to search.

పవన్‌ ఫ్యాన్స్‌కి ఆ ఆందోళన అక్కర్లేదు..!

శక్తి, షాడో వంటి డిజాస్టర్స్‌ తర్వాత మెహర్‌ రమేష్‌ మెగా ఫోన్‌ పట్టుకోవడానికి దాదాపు దశాబ్ద కాలం పట్టింది.

By:  Tupaki Desk   |   15 July 2025 7:00 PM IST
పవన్‌ ఫ్యాన్స్‌కి ఆ ఆందోళన అక్కర్లేదు..!
X

ప్రేక్షకులు కొన్ని కాంబినేషన్‌లను కోరుకుంటే, కొన్ని కాంబినేషన్‌లను అస్సలు వద్దనుకుంటారు. తమ అభిమాన హీరో ఫలానా దర్శకుడితో సినిమా చేయాలని కోరుకునే అభిమానులు, ఫలానా దర్శకుడితో అసలు సినిమా చేయవద్దని కూడా కోరుకుంటారు. పవన్‌ కళ్యాణ్ అభిమానులు అజ్ఞాతవాసి వంటి డిజాస్టర్‌ ఇచ్చినప్పటికీ త్రివిక్రమ్‌తో మరోసారి పవన్‌ సినిమా చేయాలని కోరుకుంటారు. కానీ పవన్‌ కొందరు దర్శకులతో ఎప్పటికీ సినిమా చేయవద్దని కోరుకుంటారు. అలా పవన్ సినిమా చేయవద్దని అభిమానులు కోరుకుంటున్న దర్శకుల్లో మెహర్‌ రమేష్ కూడా ఉంటాడు. ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన మెహర్‌ రమేష్ వచ్చిన ప్రతి అవకాశంను దుర్వినియోగం చేస్తూనే వచ్చాడు.

శక్తి, షాడో వంటి డిజాస్టర్స్‌ తర్వాత మెహర్‌ రమేష్‌ మెగా ఫోన్‌ పట్టుకోవడానికి దాదాపు దశాబ్ద కాలం పట్టింది. అతడు పదేళ్ల తర్వాత చిరంజీవితో 'భోళా శంకర్‌' సినిమాను తీశాడు. ఆ సినిమా ఫలితం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే మెహర్‌ రమేష్‌ మళ్లీ ఇప్పట్లో సినిమా చేసే అవకాశం లేదని చాలా మంది అంటున్నారు. అయితే మెగా ఫ్యామిలీకి మెహర్‌ రమేష్ సన్నిహితుడు. అందుకే ఏదో ఒక సమయంలో పవన్‌ కళ్యాణ్‌ నుంచి మెహర్‌ రమేష్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చే అవకాశం ఉందని కొందరు అంటూ ఉంటారు. సన్నిహితుడు, మెహర్‌ రమేష్‌కి లైఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో పవన్‌ కళ్యాణ్‌ డేట్లు ఇచ్చినా ఆశ్చర్యం లేదని, ఆ రోజు ఎప్పటికైనా రావచ్చు అని చాలా మంది అంటున్నారు.

ఇటీవల మెహర్‌ రమేష్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఎప్పటికైనా పవన్‌ కళ్యాణ్‌తో ఒక సినిమాను తీస్తాను, అందుకు పవన్‌ కళ్యాణ్‌ నుంచి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ వస్తుంది అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు పాతవే అయినప్పటికీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మెహర్‌ పాత వ్యాఖ్యలు తాజాగా వైరల్‌ అవుతున్న నేపథ్యంలో పవన్‌ ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. మెహర్‌ రమేష్‌తో సినిమా వద్దు అంటూ పవన్‌ కళ్యాణ్‌కి ఇప్పటి నుంచే సోషల్‌ మీడియా ద్వారా కొందరు ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకుంటున్నాడు.

ఇలాంటి సమయంలో మెహర్‌ రమేష్‌తో పవన్‌ కళ్యాణ్ సినిమా చేయడం అనేది దాదాపు అసాధ్యం. ఒకవేళ పవన్‌ కళ్యాణ్‌ను ఏదో ఒకటి చెప్పి మెహర్‌ రమేష్ ఒప్పించినా కూడా నిర్మాతలు ఏ ఒక్కరూ వీరి కాంబో మూవీ నిర్మించేందుకు ముందుకు వచ్చే అవకాశం లేదు అనేది కొందరి అభిప్రాయం. పవన్‌ బిజీగా ఉండటంతో పాటు, నిర్మాతలు ఎవరూ ఈ కాంబోపై నమ్మకం కనబర్చరు. కనుక పవన్‌ ఫ్యాన్స్ మెహర్‌ రమేష్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుని, కంగారు పడి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేది కొందరి అభిప్రాయం. పవన్‌ కళ్యాణ్‌ ముందు ముందు సినిమాలకు పూర్తిగా గుడ్‌ బై చెప్పే అవకాశాలు కూడా లేక పోలేదు. కనుక మెహర్‌ రమేష్‌ కూడా తన ప్రయత్నాలను విరమించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు విశ్లేషిస్తున్నారు.