నాది ప్రేమించే గోత్రం.. సేవ చేసే నక్షత్రం: పవన్ కళ్యాణ్
అభిమానుల పై తనకున్న అచంచలమైన ప్రేమే తన బలం అని పవన్ ఈ సందర్భంగా వివరించారు. రాజకీయాల్లో గెలుపోటములు ఎదురైనా.. తన వెంటే ఉండి అండగా నిలిచే సైనికులు తన అభిమానులేనని కొనియాడారు.
By: Sivaji Kontham | 16 March 2026 10:05 AM ISTహైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన `ఉస్తాద్ భగత్ సింగ్` ప్రీ-రిలీజ్ వేడుక అభిమానుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సినిమాలో హరీష్ శంకర్ రాసిన `ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం` అనే డైలాగ్‌పై పవన్ చేసిన వ్యాఖ్యానం చర్చనీయాంశమైంది. ఈ డైలాగ్ షార్ప్ గా దూసుకెళ్లినా... తన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుంటూ.. ``నాది ఇచ్చిపడేసే గోత్రం కాదు.. మిమ్మల్ని ప్రేమించే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం కాదు.. మీకు సేవ చేసే నక్షత్రం`` అని పవన్ పేర్కొనడం అభిమానుల్లో పూనకాలు తెప్పించింది.
సినిమా రంగానికి.. సమాజానికి మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ వేదికపై పవన్ కళ్యాణ్ భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. తనకు అన్నం పెట్టింది సినిమా అని.. ఈ రోజు సమాజానికి సేవ చేసే స్థాయిని.. అంతర్జాతీయ గుర్తింపును ఇచ్చింది కూడా సినిమా రంగమేనని ఆయన కృతజ్ఞత చాటుకున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నా.. సినిమా ఎప్పటికీ తన గుండెల్లోనే ఉంటుందని.. తనను ఈ స్థాయికి చేర్చిన రంగుల ప్రపంచాన్ని ఎవరూ వేరు చేయలేరని ఆయన స్పష్టం చేశారు.
అభిమానుల పై తనకున్న అచంచలమైన ప్రేమే తన బలం అని పవన్ ఈ సందర్భంగా వివరించారు. రాజకీయాల్లో గెలుపోటములు ఎదురైనా.. తన వెంటే ఉండి అండగా నిలిచే సైనికులు తన అభిమానులేనని కొనియాడారు. నేను మీకోసం నిరంతరం శ్రమిస్తాను.. మీరు కురిపించే ప్రేమే నన్ను ముందుకు నడిపించే ఇంధనం.. అని చెబుతూ అభిమానుల సంతోషం కోసం తాను ఎంతటి కష్టానికైనా సిద్ధమని తన నిబద్ధతను చాటుకున్నారు.
దర్శకుడు హరీష్ శంకర్‌తో తనకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ.. `గబ్బర్ సింగ్` వంటి భారీ విజయం తర్వాత మళ్లీ తనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. హరీష్‌కు మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలుసని.. అందుకే ఆయన రాసిన పదునైన డైలాగులు, విజువల్స్ థియేటర్లలో ప్రేక్షకులకు కనువిందు చేస్తాయని ప్రశంసించారు. ఉగాది కానుకగా మార్చి 19న విడుదల కాబోతున్న ఈ చిత్రం థియేటర్లలో పండుగ వాతావరణాన్ని తెస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈవెంట్‌లో దర్శకుడు బుచ్చిబాబు సానా పవన్‌ను ఉద్దేశించి `మా ఎమ్మెల్యే` అని పిలవడంపై పవన్ సానుకూలంగా స్పందించారు. ప్రజలు, ముఖ్యంగా యువ దర్శకులు తనపై చూపిస్తున్న ఈ అపారమైన నమ్మకం తన బాధ్యతను మరింత పెంచుతోందని అభిప్రాయపడ్డారు. తనకు అప్పగించిన ఏ బాధ్యతనైనా చిత్తశుద్ధితో నెరవేరుస్తానని.. అందరి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని ఈ వేదికగా ఆయన హామీ ఇచ్చారు.
చివరగా ఉస్తాద్ బాక్సాఫీస్ గురించి ప్రస్థావిస్తూ.. పవన్ కళ్యాణ్ పూర్తి విశ్వాసాన్ని ప్రకటించారు. `ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది` అంటూ తనదైన మేనరిజంతో చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం చిత్ర బృందం మొత్తం ఎంతో కష్టపడిందని.. ప్రజల తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో హీరోయిన్లు శ్రీలీల, రాశీ ఖన్నా, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ తదితరులు పాల్గొని సందడి చేశారు.
