Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ పైనే ఆశ‌లు పెట్టుకున్న అందాల భామ‌లు

సినీ ఇండ‌స్ట్రీలో ఎంత క‌ష్ట‌ప‌డినా స్టార్‌డ‌మ్ రావాలంటే ల‌క్ కూడా ఉండాలి. కేవ‌లం టాలెంట్ ఒక్క‌దానితో మాత్ర‌మే స్టార్లుగా రాణించేవారు చాలా త‌క్కువ మంది ఉంటారు.

By:  Tupaki Desk   |   21 July 2025 11:17 AM IST
ప‌వ‌న్ పైనే ఆశ‌లు పెట్టుకున్న అందాల భామ‌లు
X

సినీ ఇండ‌స్ట్రీలో ఎంత క‌ష్ట‌ప‌డినా స్టార్‌డ‌మ్ రావాలంటే ల‌క్ కూడా ఉండాలి. కేవ‌లం టాలెంట్ ఒక్క‌దానితో మాత్ర‌మే స్టార్లుగా రాణించేవారు చాలా త‌క్కువ మంది ఉంటారు. కొంత‌మందికి ఆ అదృష్టం లేక‌నే ఎంత క‌ష్ట‌ప‌డినా స్టార్‌డ‌మ్ మాత్రం అంద‌ని ద్రాక్ష‌లానే ఉంటుంది. హీరోయిన్ల విష‌యంలో ఈ ల‌క్ ఫ్యాక్ట‌ర్ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది.

ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల కొర‌త ఉన్న‌ప్ప‌టికీ, ఎక్కువ మంది క్లిక్ అవ‌డం లేదు. దానికి ర‌క‌ర‌కాల కార‌ణాలు ఉండొచ్చు. అలా అని హీరోయిన్లు లైట్ తీసుకోవ‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ సినిమాల కోసం క‌ష్ట‌ప‌డుతూ, వాటిపైనే ఆశ‌లు పెట్టుకుంటూ వ‌స్తున్నారు. వారిలో కొంద‌రికి స‌క్సెస్ వరిస్తే మ‌రికొంద‌రు మాత్రం హిట్ అందుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ఓ ముగ్గురు అందాల భామ‌లు త‌మ ఆశ‌ల‌న్నింటినీ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పైనే పెట్టుకున్నారు.

ప్ర‌స్తుతం ప‌వ‌న్ తో సినిమాలు చేస్తున్న హీరోయిన్లంతా ఆయా సినిమాల‌తో ఆక‌ట్టుకుని సాలిడ్ స‌క్సెస్ అందుకోవాల‌ని చూస్తున్నారు. వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది హ‌రిహ‌ర వీర‌మ‌ల్లులో హీరోయిన్ గా న‌టించిన నిధి అగ‌ర్వాల్ గురించి. నిధి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి దాదాపు ప‌దేళ్లవుతున్న‌ప్ప‌టికీ ఆమె అకౌంట్ లో ఇస్మార్ట్ శంక‌ర్ త‌ప్ప మ‌రో స‌క్సెస్ లేదు. అయిన‌ప్ప‌టికీ నిధి ప్ర‌తీ సినిమా కోసం తెగ క‌ష్ట‌ప‌డుతూనే ఉన్నారు. ఆ క‌ష్టానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లంగానే పవ‌న్ తో వీర‌మ‌ల్లు, ప్ర‌భాస్ తో రాజా సాబ్ లో అవ‌కాశాలందుకున్నారు. జులై 24న వీర‌మ‌ల్లు రిలీజ్ కానుంది. వీర‌మ‌ల్లులో పంచ‌మిగా క‌నిపించ‌బోతున్న నిధి అగ‌ర్వాల్ ఆ మూవీపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. వీర‌మ‌ల్లు స‌క్సెస్ అయి, అందులో ఆమె పాత్ర‌కు త‌గిన గుర్తింపు లభిస్తే, నిధి కెరీర్ కు ఆ స‌క్సెస్ చాలా ప్ల‌స్స‌య్యే ఛాన్సుంది.

వీర‌మ‌ల్లు త‌ర్వాత ప‌వ‌న్ నుంచి రాబోతున్న సినిమా ఓజి. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న ప్రియాంక అరుళ్ మోహ‌న్ న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఆమె తెలుగులో గ్యాంగ్ లీడ‌ర్, స‌రిపోదా శ‌నివారం సినిమాలు చేసి యావ‌రేజ్ రిజ‌ల్ట్స్ ను అందుకున్నారు. ఇప్పుడు ఓజీలో ప్రియాంక హీరోయిన్ గా న‌టిస్తున్నారు. తెలుగులో ప‌వ‌న్ లాంటి టాప్ హీరోల‌తో ప్రియాంక న‌టించడం ఇదే ఫ‌స్ట్ టైమ్. ఈ సినిమాలో ప్రియాంక న‌టిగా ఆక‌ట్టుకుని ఓజి హిట్ అయితే ప్రియాంక‌కు టాలీవుడ్ లో మ‌రిన్ని స్టార్ హీరోల సినిమాల్లో అవ‌కాశాలొచ్చే వీలుంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఓజీ సెప్టెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ రెండూ కాకుండా ప‌వ‌న్ చేస్తున్న మ‌రో సినిమా ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్. గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర్వాత ప‌వ‌న్, హ‌రీష్ క‌లిసి చేస్తున్న రెండో సినిమాగా దీనిపై అంద‌రికీ మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాలో శ్రీలీలతో పాటూ రాశీఖ‌న్నా కూడా న‌టిస్తున్నారు. ఒక‌ప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోల‌తో న‌టించిన రాశీ చేతిలో ప్ర‌స్తుతం తెలుసు క‌దా సినిమా త‌ప్ప మ‌రో పెద్ద ప్రాజెక్టు లేదు. ఇప్పుడు ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ఛాన్స్ రాశీకి జాక్ పాట్ లాంటిదే. ఈ సినిమా స‌క్సెస్ అయితే రాశీ తిరిగి ఫామ్ లోకి వ‌చ్చే అవ‌కాశాలు లేక‌పోలేదు. మొత్తానికి నిధి అగ‌ర్వాల్, ప్రియాంక అరుళ్ మోహ‌న్, రాశీ ఖ‌న్నా ముగ్గురూ ప‌వ‌న్ పైన‌, ఆయ‌న సినిమాల పైనే త‌మ ఆశ‌ల‌న్నింటినీ పెట్టుకున్నారు. మ‌రి ఆ హీరోయిన్ల ఆశ‌ల‌ను ప‌వ‌న్ ఏ మేర‌కు నెర‌వేరుస్తారో చూడాలి.