Begin typing your search above and press return to search.

పవన్ మూవీ ఆపే ధైర్యం, దమ్ము ఎవరికీ లేదు.. ఇప్పటికే క్లారిటీ ఇచ్చా: దిల్ రాజు

మే 18న జరిగిన ఛాంబర్ మీటింగ్‌ లో ఏం జరిగిందో తెలియకుండానే మీడియాలో వార్తలు వచ్చాయని, అది కేవలం ఎగ్జిబిటర్స్ ఆలోచన మాత్రమేనని చెప్పారు.

By:  Tupaki Desk   |   26 May 2025 5:13 PM IST
పవన్ మూవీ ఆపే ధైర్యం, దమ్ము ఎవరికీ లేదు.. ఇప్పటికే క్లారిటీ ఇచ్చా: దిల్ రాజు
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ 12వ తేదీన సినిమాను రిలీజ్ చేయనున్నట్లు కొద్ది రోజుల క్రితం మేకర్స్ ప్రకటించారు. వరుస అప్డేట్స్ కూడా ఇస్తున్నారు.

దీంతో హరిహర వీరమల్లు మూవీ కోసం ఆయన అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో పర్సంటేజ్ విధానంలోనే సినిమాలు రిలీజ్ చేయాలని ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే జూన్ 1వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ బంద్ చేస్తామని కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత థియేటర్స్ బంద్ ఏం లేదని ఫిల్మ్ ఛాంబర్ వెల్లడించింది. అయితే పవన్ సినిమాల ముందే ఎందుకు ఇలా జరుగుతుందని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విచారణకు ఆదేశించారు. ఎవరితో చర్చించి థియేటర్స్ బంద్ చేస్తామని ప్రకటించారో విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఆ విషయంపై నిర్మాత అల్లు అరవింద్ ఇప్పటికే స్పందించారు. పవన్ మూవీ రిలీజ్ కు ముందు అలా చేయడం దుస్సాహసమేనని అన్నారు. ఇప్పుడు దిల్ రాజు రెస్పాండ్ అయ్యారు. మే 18న జరిగిన ఛాంబర్ మీటింగ్‌ లో ఏం జరిగిందో తెలియకుండానే మీడియాలో వార్తలు వచ్చాయని, అది కేవలం ఎగ్జిబిటర్స్ ఆలోచన మాత్రమేనని చెప్పారు.

థియేటర్లు బంద్ చేస్తామని ఎగ్జిబిటర్లు చెబితే వద్దని తాను వారించానని, ఛాంబర్‌ కు అప్పుడు వాళ్లు పర్సంటేజీ విషయంలో లేఖ రాశారని వెల్లడించారు. కొవిడ్ సమయంలో తప్ప ఎప్పుడు థియేటర్లు మూతపడలేదని పేర్కొన్నారు. 56 రోజులు పరిశ్రమలో షూటింగ్ ఆపేసి ఏం సాధించలేకపోయామని, ఎగ్జిబిటర్ల సమస్యలపై చర్చించామని తెలిపారు.

అయితే హరిహర వీరమల్లు విషయంలో మ్యాటర్ తప్పుగా రీచ్ అయిందని దిల్ రాజు తెలిపారు. ఏదేమైనా పవన్‌ సినిమాలను ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. మంత్రి దుర్గేష్ గారు ఫోన్ చేస్తే థియేటర్లు మూసివేయరని ఇప్పటికే క్లారిటీగా చెప్పానని అన్నారు. తప్పుడు సమాచారం వచ్చిందని ఆయనకు నీట్ గా వివరించానని చెప్పారు. రెండు ప్రభుత్వాలు సినీ పరిశ్రమకు అండగా ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు.