రత్నం కోసం జీవితంలో తొలిసారి.. ఆయన మౌనమే..: పవన్ కళ్యాణ్
టాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు పవన్ కళ్యాణ్.. తన కెరీర్ లో సినిమాల పరంగా తొలిసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు.
By: Tupaki Desk | 21 July 2025 3:21 PM ISTటాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు పవన్ కళ్యాణ్.. తన కెరీర్ లో సినిమాల పరంగా తొలిసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తన అప్ కమింగ్ మూవీ హరిహర వీరమల్లు మేకర్స్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సందడి చేశారు. తాను వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం కోసమే వచ్చానని తెలిపారు.
తన జీవితంలో సినిమా పరంగా మీడియాతో మాట్లాడడం ఇదే తొలిసారి అని, మూవీలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో తనకు తెలియదని చెప్పారు. సినిమా కోసం ఇంతలా అంతలా కష్టపడ్డామని చెప్పడం ఎబ్బెట్టుగా ఉంటుందని అన్నారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తన ఫొటోలు కూడా పేపర్లో వేయలేదని గుర్తు చేసుకున్నారు.
అందుకే పబ్లిసిటీ లేకుండానే తాను నటించిన సినిమాలు రిలీజ్ అయ్యాయని చెప్పారు. ఒక చిత్రాన్ని తెరకెక్కించాలంటే ఎన్నో యుద్ధాలు చేయాలని, మన ఇండస్ట్రీకి పాన్ ఇండియా స్థాయికి తీసుకువెళ్లిన వ్యక్తి రత్నమని కొనియాడారు. ఆయన ఎంతో ముందుచూపు ఉన్న నిర్మాతగా పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు.
సినిమా కోసం ఎంతో నలిగిపోయారని, వీరమల్లు పూర్తవుతుందా లేదా అని అనుకున్నప్పుడు ఎం ఎం కీరవాణి ప్రాణం పోశారని చెప్పారు. కానీ ఒక్కోసారి డబ్బులు, సక్సెస్ కోసం కాదు ఇండస్ట్రీ బాగుకోరే వ్యక్తుల వెంట నిలవడం ఎంతో ముఖ్యమని అన్నారు. అందుకే ప్రత్యర్థులు తిడుతున్నా. తాను ప్రెస్ మీట్ కు వచ్చానని తెలిపారు.
నిర్మాత రత్నం నలిగిపోతుంటే చాలా బాధ కలిగిందని అన్నారు. సినిమా చాలాసార్లు ఆలస్యం అయినప్పటికీ ఎన్నో మాటలు వచ్చినా ఆయన మౌనంగా ఉన్నారని తెలిపారు. చాలా మంది ట్రోల్స్ చేసినా.. రత్నం గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పారు. అప్పుడు ఆయన మౌనంగా ఉన్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు.
రత్నం మౌనమే ఇక్కడికి తనను రప్పించిందని, ఆయన కోసమే చెప్పేందుకు వచ్చానని పవన్ అన్నారు. తనకు సినిమా అన్నం పెట్టిందని, చిత్రం అంటే ప్రాణవాయువుతో సమానంమని చెప్పారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు ఛైర్మన్ గా రత్నం పేరును ప్రతిపాదించినట్లు తెలిపారు. పవన్ లీడ్ రోల్ లో రత్నం నిర్మిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం.. జులై 24న రిలీజ్ కానుంది.
