Begin typing your search above and press return to search.

వీరమల్లు.. ఈ ఎఫర్ట్ ముందే పెట్టుంటే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా ఏళ్ల నుంచి వరుసగా రీమేక్‌లే చేస్తున్నాడని ఆయన అభిమానులు ఎంతో అసంతృప్తితో ఉన్నారు.

By:  Tupaki Desk   |   28 July 2025 9:00 PM IST
వీరమల్లు.. ఈ ఎఫర్ట్ ముందే పెట్టుంటే
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా ఏళ్ల నుంచి వరుసగా రీమేక్‌లే చేస్తున్నాడని ఆయన అభిమానులు ఎంతో అసంతృప్తితో ఉన్నారు. ఐతే ఈ రీమేక్‌ల మధ్య ఆయన క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే భారీ పీరియాడిక్ చిత్రం మొదలుపెట్టినపుడు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. దీని ఫస్ట్ టీజర్ రిలీజైనపుడు.. ఇది కదా పవన్ నుంచి కోరుకున్నది అంటూ ఎగ్జైట్ అయ్యారు. పవన్ పొటెన్షియాలిటీకి తగ్గ చిత్రమని.. దీంతో ఆయన పాన్ ఇండియా స్థాయిలో సంచలనం రేపుతారని ఆశించారు. కానీ తర్వాతి రోజుల్లో ఆ ఎగ్జైట్మెంట్ అంతా నీరుగారిపోయింది.

సినిమా విపరీతంగా ఆలస్యం అవడం, దర్శకుడు మారడం, రిలీజ్ డేట్లు పదే పదే మారడం.. ఇలా అనేక రకాల కారణాలతో ‘హరిహర వీరమల్లు’కు హైప్ తగ్గింది. ఐతే పవన్ సినిమాల విషయంలో రిలీజ్‌కు కొన్ని రోజుల ముందు ఎలా ఉన్నా.. బొమ్మ పడే సమయానికి అంతా మారిపోతుంది. రావాల్సిన హైప్ వచ్చేస్తుంది. 'వీరమల్లు' విషయంలో కూడా అదే జరిగింది.

సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసేదే. కానీ టాక్ ఆశించిన విధంగా రాలేదు. ప్రధానంగా ఈ సినిమాకు ద్వితీయార్ధంలో విజువల్ ఎఫెక్ట్స్, పతాక సన్నివేశాలు మైనస్‌గా మారాయి. సినిమా మీద నెగెటివిటీ పెరిగిపోవడానికి అవే ప్రధాన కారణాలు. స్వయంగా పవన్ అభిమానులే ఈ విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఐతే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా.. రిలీజైన రెండు రోజుల తర్వాత సినిమాకు కరెక్షన్లు చేశారు. విజువల్ ఎఫెక్ట్స్ మెరుగుపరిచారు. కొన్ని బోరింగ్ సీన్లను ట్రిమ్ చేశారు. అలాగే ముగింపు సన్నివేశాల్లో కొంత కోత పెట్టారు. ఈ రీలోడెడ్ వెర్షన్ చూసిన వాళ్లు సినిమా నాట్ బ్యాడ్ అంటున్నారు. ఐతే సెకండాఫ్‌లో వీఎఫెక్స్ బాగా లేదని.. క్లైమాక్స్ తేడాగా ఉందని రిలీజ్ తర్వాత ప్రేక్షకులే చెప్పాలా? రిలీజ్‌కు ముందు చూసిన టీం సభ్యులకు తెలియలేదా? గత నెల 12నే రిలీజ్ కావాల్సిన సినిమా.. ఇంకో నెలన్నర వాయిదా పడింది. ఇప్పుడు రిలీజైన రెండు రోజులకే కరెక్ట్ చేయగలిగిన వాళ్లు.. అంతకుముందు దొరికిన నెలన్నర సమయంలో ఏం చేస్తున్నారన్నది ప్రశ్న. కాస్త ముందే జాగ్రత్త పడి ఉంటే.. ఇప్పుడీ ప్రయాస తప్పేది. సినిమాకు అంత నెగెటివ్ టాక్ వచ్చేది కాదు. రిజల్ట్ చాలా బెటర్‌గా ఉండేది.