వీరమల్లు నిర్మాతకు పవన్ దిశానిర్దేశం
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు హరి హర వీరమల్లు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 18 Jun 2025 10:53 AM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు హరి హర వీరమల్లు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాబీ డియోల్ సహా పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అవ్వగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. గ్రాఫిక్స్ అండ్ వీఎఫ్ఎక్స్ వర్క్స్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారని సమాచారం.
అయితే సినిమా రిలీజ్ డేట్ కోసం ఇప్పుడు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు సినీ ప్రియులు, అభిమానులు. ఎందుకంటే.. ఇప్పటికే వివిధ కారణాల వల్ల వీరమల్లు చాలా లేట్ అయింది. సుమారు ఐదేళ్లపాటు సెట్స్ పై ఉంది. రీసెంట్ గా పవన్ డేట్స్ ఇవ్వడంతో షూట్ కంప్లీట్ అవ్వగా.. జూన్ 12న రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.
కానీ ఆ తర్వాత వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. దీంతో అంతా ఎదురుచూస్తున్నారు. అయితే నేడు (జూన్ 18న) హరిహర వీరమల్లు రిలీజ్ సహా ట్రైలర్ అప్డేట్ ను మేకర్స్ అందించనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం లేదు.
కాగా, జూన్ లో కాదు.. జులైలో కూడా వీరమల్లు రిలీజ్ అవ్వడం కష్టమేనని అంతా అంటున్నారు. అదే సమయంలో లాస్ట్ మినిట్ లో మూవీ రిలీజ్ వాయిదా పడటం పట్ల పవన్ అసంతృప్తి చెందారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం సినిమా విడుదల అవుతుందని కచ్చితంగా తెలియకపోతే కొత్త తేదీని ప్రకటించవద్దని ఆదేశించారని టాక్.
ఆ విషయంపై నిర్మాత రత్నంకు తేల్చి చెప్పారట. అయితే విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ వల్లే సినిమా రిలీజ్ ఆలస్యమైందని తెలుస్తున్నా.. ఇంకొందరు మాత్రం వేరే సమస్యలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అందుకే వాటిని గుర్తించిన పవన్.. ప్రకటన చేసే ముందు అన్నింటినీ పరిష్కరించాలని నిర్మాతకు చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత విడుదల తేదీ అనౌన్స్ చేయమని ఆదేశించారట! మరి వీరమల్లు ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.
