సత్యాగ్రహి ఎందుకు ఆగిపోయిందో చెప్పిన నిర్మాత
ఈ సందర్భంగా పవన్ తో తాను గతంలో చేయాలనుకున్న సత్యాగ్రహి సినిమా ఆగిపోవడానికి గల కారణాలను కూడా ఆయన వివరించారు.
By: Tupaki Desk | 21 May 2025 5:06 PM ISTప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో పలు సినిమాలున్నాయి. వాస్తవానికి ఆ సినిమాలన్నీ ఎప్పుడో పూర్తవాల్సింది కానీ పవన్ రాజకీయాల్లో బిజగా అవడం, ఆ తర్వాత ఎలక్షన్లు రావడం, ఎన్నికల్లో గెలిచి పవన్ మరింత బిజీ అవడంతో ఎంత సినిమాలను పూర్తి చేద్దామనుకున్నప్పటికీ కుదరడం లేదు. మొత్తానికి ఎన్నో ఏళ్లుగా సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లు సినిమాను పవన్ రీసెంట్ గానే ఫినిష్ చేశాడు. ఈ సినిమా జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ అసుర హననం అనే సాంగ్ ను రిలీజ్ చేస్తూ ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయగా, అందులో నిర్మాత ఏఎం రత్నం వీరమల్లు సినిమాతో పాటూ మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. తాను ఇండస్ట్రీకి వచ్చి 54 ఏళ్లు అవుతుందని, అన్ని భాషల్లోనూ హిట్ సినిమాలు తీశానని, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీయడమంటే తనకు ఇంట్రెస్ట్ అని ఆయన అన్నారు.
వీరమల్లు సినిమాను ఎంతో కష్టపడి రూపొందించామని చెప్పిన ఏ.ఎం రత్నం క్రిష్ చెప్పిన స్టోరీ లైన్ తో పవన్ ను సంప్రదించానని, ఆయన ఈ కథ విని వెంటనే ఓకే చేశారని, అనుకోని కారణాల వల్ల ఈ సినిమా బాగా లేటయిందని, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని భాషల్లోనూ హిట్ అవాలని కోరుకుంటున్నట్టు ఏ.ఎం రత్నం తెలిపారు.
ఈ సందర్భంగా పవన్ తో తాను గతంలో చేయాలనుకున్న సత్యాగ్రహి సినిమా ఆగిపోవడానికి గల కారణాలను కూడా ఆయన వివరించారు. ఏ.ఎం రత్నం నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఎంతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా ఎవరికీ తెలియని కొన్ని కారణాలతో ఆగిపోయింది. సత్యాగ్రహి సినిమాను పవన్ చాలా ఇష్టంగా మొదలుపెట్టారని కానీ పలు కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయిందని క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత ఏ.ఎం రత్నంతో పవన్ బంగారం మూవీ చేసిన సంగతి తెలిసిందే.
