ఎన్టీఆర్, ఎంజీఆర్.. పవన్ కళ్యాణ్ పాత్రకు స్పూర్తి వారే: జ్యోతికృష్ణ
పవన్ కళ్యాణ్ పాత్రను “పీపుల్స్ మ్యాన్” గా, ధర్మం కోసం పోరాడే యోధుడిగా చూపించాలనే ఆలోచనతో స్క్రిప్ట్ రాసినట్లు దర్శకుడు వివరించారు.
By: Tupaki Desk | 15 July 2025 12:44 PM ISTపవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరి హర వీర మల్లు సినిమా ఈ జూలై 24న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈ సినిమాపై భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ పాత్రను డిజైన్ చేసే సమయంలో ఆయనకు స్పూర్తి ప్రముఖ నేతలు, నటులు అయిన ఎన్టీఆర్, ఎంజీఆర్ నుంచే వచ్చిందని తెలిపారు.
పవన్ కళ్యాణ్ పాత్రను “పీపుల్స్ మ్యాన్” గా, ధర్మం కోసం పోరాడే యోధుడిగా చూపించాలనే ఆలోచనతో స్క్రిప్ట్ రాసినట్లు దర్శకుడు వివరించారు. ముఖ్యంగా ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా సినిమాల్లో సందేశాత్మక పాత్రలతో ప్రజల హృదయాలను గెలుచుకున్నారని గుర్తు చేశారు. అదే తరహాలో పవన్ పాత్రను నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దామని అన్నారు.
ఈ క్రమంలో ఆయన ప్రత్యేకంగా 'మాట వినాలి' అనే పాట గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలు, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఈ పాటను రచించామని తెలిపారు. ఇది పాజిటివ్ ఎనర్జీ, ధర్మాన్ని పాటించే భావాలను ప్రేరేపించేదిగా ఉంటుందని, ప్రేక్షకుల మీద ఈ పాట తీవ్రంగా ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు.
అలాగే ఎన్టీఆర్ గారి నటనలోని ప్రత్యేకతను గుర్తు చేసిన జ్యోతి కృష్ణ “ఎన్టీఆర్ గారు రాముడిగా, కృష్ణుడిగా చేసిన పాత్రలు ఇప్పటికీ మర్చిపోలేనివి. ఆయన చేతిలో ఉన్న విల్లు, బాణం అంటే ధర్మాన్ని నిలబెట్టే శక్తికి ప్రతీక.” అని అన్నారు. అదే తరహాలో పవన్ కళ్యాణ్ పాత్రలో కూడా విల్లు, బాణాలను ముఖ్యంగా చూపించామని, ఇది ఆయన శక్తిని, ధర్మాన్ని నిలబెట్టే స్ఫూర్తిని చూపిస్తుందని వెల్లడించారు.
ఇలాంటి ప్రతీ అంశం పవన్‌ను హీరోగా కాకుండా ఒక నాయకుడిగా ప్రజలు చూస్తున్న సందర్భంలో వచ్చిన ఆలోచనల ఆధారంగా ఉందని చెప్పారు. “ప్రతి సన్నివేశం ప్రత్యేకంగా ఉండేలా, ప్రేక్షకుడిలో ప్రభావం కలిగించేలా తీర్చిదిద్దాలనిపించింది. అందుకే ప్రతి సీన్‌ను ఒక స్పెషల్ మూమెంట్‌గా డిజైన్ చేశాం” అని దర్శకుడు జ్యోతికృష్ణ స్పష్టం చేశారు.
హరిహర వీర మల్లులో పవన్ పాత్ర ఒక్క యోధుడిగా కాకుండా ప్రజలకు మార్గదర్శకుడిగా ఉంటుందని, సినిమా మొత్తంలో ధర్మం, శక్తి, నాయకత్వం అనే అంశాలపై దృష్టి పెట్టామని తెలిపారు. జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా, పవన్ అభిమానులకు ఒక ప్రేరణాత్మకమైన వినోదం అందించనుందని అన్నారు.
