పీకే విషయంలో ఆలస్యం అమృతమా? విషమా!
ఆలస్యం అమృతం విషం అంటే? సకాలంలో పూర్తి చేయాల్సిన పనిని పూర్తి చేయకుండా ఆలస్యం చేస్తే అది విషంగా మారుతుంది.
By: Tupaki Desk | 30 May 2025 4:00 PM ISTఆలస్యం అమృతం విషం అంటే? సకాలంలో పూర్తి చేయాల్సిన పనిని పూర్తి చేయకుండా ఆలస్యం చేస్తే అది విషంగా మారుతుంది. ఫలితంగా లాభాలు వచ్చే చోట కూడా నష్టాలు ఎదురవుతాయన్నది అర్దం. మరి ఈ సామెతను పవన్ అమృంతం చేస్తాడా? విషంగా మారుస్తాడా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న `హరిహరవీరమల్లు` రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.
జూన్ 12న చిత్రం పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. ఈసినిమా ఐదేళ్ల క్రితం మొదలు పెట్టిన ప్రాజెక్ట్ . కానీ పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఇంతకాలం వాయిదా పడుతూ వచ్చింది. ఎన్నో రిలీజ్ తేదీలు ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. దీంతో సినిమాపై బజ్ కూడా తగ్గిపోయింది. ప్రస్తుతం సినిమాని మళ్లీ పైకి లేపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టకేలకు అన్ని పనులు పూర్తి చేసుకుని జూన్ లో రిలీజ్ అవుతుంది.
అయితే ఐదేళ్ల గ్యాప్ రావడంతో? సినిమా ఎలాంటి ఫలితం సాధిస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. విజయంతో అమృతాన్ని అందిస్తుందా? వైఫల్యంతో విషయాన్ని చిమ్ముతుందా? అన్నది చర్చగా మారింది. అయితే ఇలా ఆలస్యంగా రిలీజ్ అయిన కొన్ని చిత్రాలు గతంలో మంచి విజయాలు సాధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. పాన్ ఇండియా చిత్రం 'బాహుబలి' రిలీజ్ తేదీలు ఎన్నో మారాయి.
కానీ ఆ సినిమా పాన్ ఇండియాలో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఆ తర్వాత `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ విషయంలోనూ చాలా తేదీలు మారాయి. కానీ ఈసినిమా కూడా రికార్డు వసూళ్లను సాధించింది. అంతకు ముందు అనుష్క నటించిన `అరుంధతి` విషయంలో ఇదే జరిగింది. ఈ సినిమా రిలీజ్ కు కొన్ని సంవత్సరాలు పట్టింది. రిలీజ్ అనంతరం టాలీవుడ్ చరిత్రలోనే నిలిచిపోయింది. వీరమల్లు విషయంలోనూ ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.
