పవన్ కళ్యాణ్ బావుందన్న కథను కావాలని పక్కనపెట్టా
ఈ నేపథ్యంలో బొమ్మరిల్లు భాస్కర్ గతంలో తాను పవన్ కళ్యాణ్ కు ఓ కథ వినిపించినట్టు చెప్పుకొచ్చాడు.
By: Tupaki Desk | 12 April 2025 2:00 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు సినిమాలకు కమిట్ అయిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఆ మూడు సినిమాలు ఎప్పుడో రిలీజవాల్సింది. కానీ ఇప్పటివరకు వాటిలో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. పవన్ ఏపీ రాజకీయాల్లో బిజీ అవడం వల్ల కమిట్ అయిన సినిమాలకు కూడా డేట్స్ ఇవ్వలేకపోతున్నాడు. దర్శకనిర్మాతలు కూడా విషయాన్ని అర్థం చేసుకుని పవన్ కు కుదిరినప్పుడే షూటింగ్స్ పెట్టుకుంటున్నారు.
పవన్ ఇప్పుడు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసిన తర్వాత మళ్లీ కొత్త సినిమాలను ఒప్పుకుంటాడో లేదో కూడా తెలియదు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పవన్ అసలు ఖాళీగా లేరు. ఓ వైపు డిప్యూటీ సీఎంగా తన బాధ్యతల్ని నెరవేరుస్తూనే మరోవైపు హీరోగా ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తున్నారు. పవన్ సరే అంటే సినిమాలు చేయడానికి ఎంతోమంది దర్శకనిర్మాతలు రెడీగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో బొమ్మరిల్లు భాస్కర్ గతంలో తాను పవన్ కళ్యాణ్ కు ఓ కథ వినిపించినట్టు చెప్పుకొచ్చాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రీసెంట్ గా సిద్దు జొన్నలగడ్డ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా జాక్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. జాక్ మూవీకి ఆడియన్స్ నుంచి మిక్డ్స్ రెస్పాన్స్ వస్తుంది.
జాక్ ప్రమోషన్స్ లో భాగంగా బొమ్మరిల్లు భాస్కర్ పలు విషయాలను వెల్లడించాడు. తన కెరీర్ బెస్ట్ మూవీ ఇప్పటివరకు తీయలేదని, ఆ మూవీ చేయాలనుందని, ఆరెంజ్ మూవీ టైమ్ లోనే పవన్ కళ్యాణ్ కు ఆ కథ చెప్పానని, ఆ మూవీని తీస్తే బెస్ట్ సినిమా అవుతుందని, ఆ కథ పవన్ కు చెప్పినప్పుడు ఇలా కూడా కథలు రాస్తారా? చాలా డిఫరెంట్ గా బావుందన్నారని భాస్కర్ తెలిపాడు.
పవన్ ఆ కథను అంతగా మెచ్చుకున్నప్పటికీ తానే దాన్ని పక్కన పెట్టానని, ఆ కథ ఫినిష్ చేయాలంటే తాను చాలా లైఫ్ ను ఎక్స్‌పీరియెన్స్ చేయాలనిపించిందని, ఆ అనుభవాలే కథకు చాలా వరకు పనికొస్తాయనిపించిందని, ఇప్పుడు ఆ స్టోరీకి కావాల్సిన ఎక్స్‌పీరియెన్స్ వచ్చిందని, అందుకే స్టోరీని రెడీ చేసినట్టు భాస్కర్ చెప్పుకొచ్చాడు. మరి భాస్కర్ ఇప్పుడు ఆ కథను పవన్‌కే చెప్తాడా లేదా మరో స్టార్ హీరోతో చేస్తాడా అనేది చూడాలి. అయితే అప్పుడెప్పుడో పవన్ బావుందని చెప్పిన కథను ఇప్పుడు తీస్తే వర్కవుట్ అవుతుందా అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ పదిహేనేళ్లలో చాలా మార్పులొచ్చాయి. కాబట్టి బొమ్మరిల్లు భాస్కర్ ఆ కథను ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
