Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ సినిమాల‌కు మోక్షం ఎప్పుడో?

అయితే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`ని ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ ఈ ప్రాజెక్ట్ ద‌ర్శ‌కుడికి, నిర్మాత‌కు చుక్క‌లు చూపిస్తూ నిత్యం వార్త‌ల్లో నిలుస్తోంది.

By:  Tupaki Desk   |   18 April 2025 11:42 AM IST
ప‌వ‌న్ సినిమాల‌కు మోక్షం ఎప్పుడో?
X

ఇండ‌స్ట్రీలో ముహూర్తాల‌కు, షూటింగ్ స్టార్ట్, రిలీజ్ డేట్‌ల‌కు చాలా ప్రాధాన్య‌త‌నిస్తుంటారు. పెద్ద‌పీట వేస్తుంటారు. కార‌ణం మంచి ముహూర్తాన ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకాలు ఎదుర‌వ్వ‌వ‌ని, సాఫీగా షూటింగ్ పూర్త‌యి అనుకున్న స‌మ‌యానికి ప్రాజెక్ట్ ప్రేక్ష‌కుల ముందుకొస్తుంద‌ని. అయితే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`ని ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ ఈ ప్రాజెక్ట్ ద‌ర్శ‌కుడికి, నిర్మాత‌కు చుక్క‌లు చూపిస్తూ నిత్యం వార్త‌ల్లో నిలుస్తోంది.

కోవిడ్ టైమ్‌కు ముందు నుంచి వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తోంది. 2020 జ‌న‌వ‌రిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ లుక్ టెస్ట్ చేశారు. ఆ త‌రువాత అధికారికంగా ప్ర‌క‌టించారు. కోవిడ్‌కు ముందే అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఈ సినిమా కోసం భారీ సెట్‌ల‌ని ఏర్పాటు చేశారు. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్ ఆల‌స్యం కావ‌డం, ఆ త‌రువాత వ‌ర్షాలు ప‌డ‌టంతో సెట్‌లు పాక్షికంగా దెబ్బ‌తిన్నాయి. దీంతో మ‌ళ్లీ సెట్‌ల‌ని మార్పులు చేర్పుల‌తో సిద్ధం చేసి షూటింగ్ మొద‌లు పెట్టారు. అక్క‌డి నుంచి ఈ మూవీ షూటింగ్ సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా సాగుతూనే ఉంది.

దీనికి క్రిష్ డైరెక్ట‌ర్‌. అయితే సినిమా క‌థ తీత్యా రెండు భాగాలు తీయాల‌ని నిర్ణ‌యించుకోవ‌డంతో పార్ట్ 2 కోసం నిర్మాత త‌న‌యుడు జ్యోతికృష్ణ‌ని రంగంలోకి దించారు. దీంతో క్రిష్ ఫ‌స్ట్ పార్ట్ షూటింగ్ పూర్తి కాకుండానే ప‌క్క‌కు త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. గ‌త కొంత కాలంగా ఆల‌స్యం అవుతూ వ‌స్తున్న ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్ సినీ చ‌రిత్ర‌లోనే ఇంత‌గా డిలే అయిన ప్రాజెక్ట్‌గా రికార్డుని సొంతం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ప‌వ‌న్ రాజ‌కీయాల్లో బిజీ కావ‌డం, డేట్స్ స‌ర్దుబాటు చేయ‌లేక‌పోవ‌డంతో ఈ ప్రాజెక్ట్ గ‌త కొంత కాలంగా ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది.

17వ శ‌తాబ్దం నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌లు చాలా వ‌ర‌కు మారుతూ వ‌చ్చాయి. 2022, జ‌న‌వ‌రి 14న రిలీజ్ చేస్తామ‌ని ముందు ప్ర‌క‌టించారు. కానీ రాలేదు. తాజాగా ఈ ఏడాది మార్చి 25న రిలీజ్ చేస్తామ‌న్నారు కానీ జ‌ర‌గ‌లేదు. ఫైన‌ల్‌గా మే 9న రిలీజ్ అని ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఆ డేట్‌న కూడా ఈ సినిమా వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. దీంతో ప‌వ‌న్ అభిమానుల్లో అస‌హ‌నం మొద‌లైంది. ప‌వ‌న్ న‌టిస్తున్న తొలి పీరియ‌డిక్ ఫిల్మ్‌కు ఇన్ని అడ్డంకులేంట‌ని, ఈ సినిమాకు మోక్షం ఎప్పుడు ల‌భిస్తుంద‌ని అభిమానులు వాపోతున్నారు. ఈ సినిమాతో పాటు `ఓజీ`, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌` సినిమాల ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ఎవ‌రీ అర్థం కావ‌డం లేదు.