'పర్సంటేజీ సమస్య'పై పవన్ కల్యాణ్ కి నిర్మాతల విన్నపం
టాలీవుడ్‌లో ప్రస్తుతం నడుస్తున్న పర్సంటేజ్ సిస్టమ్ సమస్యపై మైత్రీ రవిశంకర్, సితార నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, సతీష్ కిలారు వంటి ప్రముఖ నిర్మాతలు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసినవారిలో ఉన్నారు.
By: Sivaji Kontham | 27 May 2026 11:48 AM ISTఇటీవలి కాలంలో సింగిల్ థియేటర్లను రెంటల్ విధానంలో కాకుండా పర్సంటేజీ విధానంలో నడిపిస్తామని అంటున్నారు తెలంగాణ థియేటర్ యజమానులు. అయితే దీనిని నిర్మాతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే క్రమంలో తెలుగు ఫిలింఛాంబర్ లో సినీపెద్దల సమక్షంలో సింగిల్ థియేటర్ సమస్యల్ని పరిష్కరించేందుకు ఎలాంటి కొత్త విధానాన్ని తీసుకు రావాలి అనేదానిపై తర్జన భర్జన సాగుతోంది.
ఇంతకుముందే ఇండస్ట్రీ పెద్ద అయిన మెగాస్టార్ చిరంజీవిని కలిసిన సింగిల్ థియేటర్ యజమానులు (ఎగ్జిబిటర్లు) ఆయన ఇచ్చిన భరోసాతో చాలా సంతృప్తిగా ఉన్నామని ప్రకటించారు. చిరుని కలిసాక తామంతా సంతోషంగా ఉన్నామని ఎగ్జబిటర్లు వెల్లడించారని అగ్ర నిర్మాత కం ఎగ్జిబిటర్ దిల్ రాజు కూడా మీడియా సమావేశంలో వెల్లడించారు. జూన్ 30 నాటికి ఈ సమస్యకు ఒక పరిష్కారం తేవడం కోసం ఒక కమిటీ దీనిపై అధ్యయనం చేస్తోందని, కమిటీ రిపోర్ట్ రాగానే దీనికి ఒక పరిష్కారం లభిస్తుందని, అంతవరకూ వేచి చూడాలని ఎగ్జిబిటర్లకు చిరంజీవి సూచించారు. దానికి ఎగ్జిబిట్లర్లు కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా అంగీకరించిన సంగతి తెలిసిందే. అంతవరకూ రిలీజవుతున్న సినిమాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక క్లారిటీ అయితే వచ్చిందని కూడా సినీపెద్దల మాటల్ని బట్టి అర్థమైంది.
ఈసారి ఎలాగైనా సింగిల్ థియేటర్ల సమస్యను సంపూర్ణంగా పరిష్కరించుకునే ఎత్తుగడ తెలంగాణ సింగిల్ థియేటర్ ఎగ్జిబిటర్లకు ఉంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం వారంతా గట్టి పట్టు మీద ఉన్నారు. ఈ క్లిష్ఠ పరిస్థితుల్లో వారంతా చిరును కలిసి సమస్యకు పరిష్కారం కోరడం చర్చకు వచ్చింది. ఇంతలోనే ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు నేరుగా రాజమండ్రిలో ఈనెల 26న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ని కలిసి తమ సమస్యల్ని కూడా విన్నవించారని తెలుస్తోంది. పర్సంటేజ్ సిస్టమ్ తో తలెత్తే ఇబ్బందుల గురించి ముఖ్యంగా పవన్ తో నిర్మాతలు చర్చించారు. ఇదే సమయంలో గతంలో `హరిహర వీరమల్లు` సినిమా సమయంలో ఇలాంటి పర్సంటేజ్ సమస్య వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేసారో కూడా చర్చించినట్టు తెలుస్తోంది. అప్పట్లో పవన్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. కొందరు కావాలనే తన సినిమాను టార్గెట్ చేస్తున్నారని సీరియస్ అవ్వడంతో అప్పట్లో సమస్య వెంటనే సద్ధుమణిగింది. ఈసారి కూడా ఆయన చొరవతోనే త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని నిర్మాతలు బలంగా నమ్ముతున్నారు.
ఇటీవలే థియేటర్ల ఎగ్జిబిటర్లు మెగాస్టార్ చిరంజీవిని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. దీనికి ప్రతిగానే నిర్మాతలు కూడా తమ బలాన్ని నిరూపించుకునేందుకు డిప్యూటీ సీఎంను కలవడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుత ప్రభుత్వ కూటమి అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో యాక్టివ్ నిర్మాతలంతా పవన్ కళ్యాణ్‌ను కలవడం ఇది రెండోసారి కావడం విశేషం.
టాలీవుడ్‌లో ప్రస్తుతం నడుస్తున్న పర్సంటేజ్ సిస్టమ్ సమస్యపై మైత్రీ రవిశంకర్, సితార నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, సతీష్ కిలారు వంటి ప్రముఖ నిర్మాతలు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసినవారిలో ఉన్నారు. గతానుభవం దృష్ట్యా పవన్ దీనికి ఒక పరిష్కారం చూపుతారని కూడా నిర్మాతలు కలిసారు. పరిశ్రమలో ఒక పెద్ద సమస్యకు పరిష్కారం కోరుతూ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు మెగా బ్రదర్స్ ని కలవడం ఆసక్తిని కలిగిస్తోంది. అంతిమంగా ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే జూన్ 30 న కమిటీ రిపోర్ట్ వచ్చే వరకూ వేచి చూడాల్సి ఉంటుంది.
