వీరమల్లు.. క్రిష్ తీసింది 30-40 శాతమేనట
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యంత సుదీర్ఘ కాలం చిత్రీకరణ జరుపుకున్న ‘హరిహర వీరమల్లు’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
By: Tupaki Desk | 24 July 2025 11:00 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యంత సుదీర్ఘ కాలం చిత్రీకరణ జరుపుకున్న 'హరిహర వీరమల్లు' ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ప్రథమార్ధం వరకు ఓకే అనిపించినా.. సెకండాఫ్ తేడా కొట్టేసిందన్నది ఎక్కువమంది చెబుతున్న మాట.
నిజానికి ఈ సినిమా అనౌన్స్ అయింది ఆరేళ్ల కిందట. అప్పుడు ఆ చిత్రానికి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఆయన నాలుగేళ్లకు పైగా ఆ సినిమాతో అసోసియేట్ అయ్యే ఉన్నాడు. కానీ మేకింగ్ మరీ ఆలస్యం కావడం, సినిమా ఎంతకీ పూర్తి కాకపోవడంతో క్రిష్ ఈ చిత్రం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ మిగతా చిత్రాన్ని పూర్తి చేసే బాధ్యతను తీసుకున్నాడు. ఐతే సినిమా మేకింగ్‌లో ఎవరి క్రెడిట్ ఎంత.. ఎవరు ఏం తీశారు అనే విషయంలో అందరికీ సందేహాలు ఉన్నాయి.
ఈ సందేహాలకు స్వయంగా పవన్ కళ్యాణే సమాధానం ఇచ్చాడు. నిన్న రాత్రి జరిగిన 'హరిహర వీరమల్లు' ప్రమోషనల్ ఈవెంట్లో పవన్.. క్రిష్ ప్రస్తావన తెచ్చాడు. ఈ సినిమాకు పునాది వేసిందే క్రిష్ అని.. ఆయన వల్లే ఈ చిత్రం తెరకెక్కిందని చెబుతూ.. సినిమాలో 30-40 శాతం సన్నివేశాలను ఆయన డైరెక్ట్ చేశాడని వెల్లడించారు. దీంతో ‘వీరమల్లు’కు అంతిమంగా ఎలాంటి ఫలితం వచ్చినా.. అందులో ఎక్కువ క్రెడిట్ జ్యోతికృష్ణకే చెందుతుందని భావించాలి.
సినిమాను పరిశీలిస్తే క్రిష్ ఎక్కువగా ప్రథమార్ధంలోని సన్నివేశాలనే డైరెక్ట్ చేసినట్లు అనిపిస్తుంది. ద్వితీయార్దంలో కథను చాలా వరకు మార్చామని.. జ్యోతికృష్ణే సొంతంగా సీన్లు రాసి డైరెక్ట్ చేశాడని నిర్మాత ఏఎం రత్నం గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే క్రిష్ కథను సగం వరకే తీసుకుని.. మిగతా సగం కొత్తగా రాసి తీశారన్నమాట. ప్రథమార్ధంలోనూ కొన్ని సీన్లు జ్యోతికృష్ణ ఖాతాలోకి వెళ్తాయని అర్థమవుతోంది.
