పవన్ ఉస్తాద్ కూడా ఇదే ఏడాది అయితే...!
పవన్ కళ్యాణ్ నుంచి మూడు సినిమాలు వస్తే ముందు ముందు మరింత మంది ఇదే ఫార్ములాను పాటించే అవకాశాలు ఉన్నాయి.
By: Tupaki Desk | 12 Jun 2025 3:00 AM ISTపవన్ కళ్యాణ్ చివరగా 2023లో 'బ్రో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంతకు ముందు ఏడాది అంటే 2022లో భీమ్లా నాయక్ సినిమా విడుదల అయింది. రాజకీయాల కారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు చాలా బ్రేక్ వచ్చింది. సుదీర్ఘ కాలం తర్వాత పవన్ కళ్యాణ్ మూవీ విడుదలకు సిద్ధం అయింది. హరి హర వీరమల్లు సినిమాను ఈ నెలలోనే విడుదల చేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ నెల చివరి వరకు లేదా వచ్చే నెలలో వీరమల్లు సినిమా విడుదల కన్ఫర్మ్ కావచ్చు. వీరమల్లు సినిమా విడుదల తేదీ విషయంలో ఇంకా క్లారిటీ రాకుండానే తదుపరి సినిమా ఓజీ రిలీజ్ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
సాహో సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఈ రెండు సినిమాలనే పవన్ కళ్యాణ్ చేస్తాడని అంతా అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా నేటి నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. పవన్ కళ్యాణ్ నుంచి ఈ ఏడాది రెండు సినిమాలు రావడం కన్ఫర్మ్ అయింది. అయితే ఈ మధ్య కాలంలో పవన్ ఆ రెండు సినిమాలను ముగించిన జోరు చూస్తూ ఉంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రెండు మూడు నెలల్లోనే పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే మరీ ఆలస్యం చేయకుండా ఇదే ఏడాదిలో ఉండే అవకాశం ఉంది.
స్టార్ హీరోల సినిమాలు ఈమధ్య కాలంలో ఏడాదికి ఒకటి మాత్రమే విడుదల అవుతోంది. కొందరు హీరోలు ఏడాదికి ఒక్కటి కూడా విడుదల చేయలేక పోతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ నుంచి మూడు సినిమాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ ఫ్యాన్స్ కి రెండు సినిమాలు విడుదల అయినా కూడా పండుగే అనడంలో సందేహం లేదు. అలాంటిది మూడు సినిమాలు విడుదల అయితే వారి ఆనందానికి అవధులు ఉండక పోవచ్చు. అంతే కాకుండా థియేటర్ల వద్ద సందడి ఓ రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది. సినిమా ఇండస్ట్రీ బాగు పడాలి అంటే, సింగిల్ స్క్రీన్ థియేటర్లు నిలవాలి అంటే స్టార్ హీరోలు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయాలి అంటున్నారు.
పవన్ కళ్యాణ్ నుంచి మూడు సినిమాలు వస్తే ముందు ముందు మరింత మంది ఇదే ఫార్ములాను పాటించే అవకాశాలు ఉన్నాయి. స్పీడ్‌గా తీసిన సినిమాలకు బడ్జెట్ తక్కువ అవుతుంది. అంతే కాకుండా నిర్మాతకు ఇబ్బందులు ఉండవు. హీరోలు ఎక్కువగా సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. ప్రేక్షకుల పై టికెట్ల భారం తగ్గించే అవకాశం ఉంటుంది. కనుక పవన్ కళ్యాణ్ నుంచి ఈ ఏడాది మూడు సినిమాలు రావాల్సిందే అని అభిమానుల బలంగా కోరుకుంటున్నారు. హరీష్ శంకర్ తలుచుకుంటే కచ్చితంగా నవంబర్ లేదా డిసెంబర్ వరకు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పవన్ నుంచి ఏడాదికి రెండు సినిమాలు వచ్చి చాలా కాలం అయింది. ఇక మూడు సినిమాలు ఆయన కెరీర్ ఆరంభం నుంచి ఎప్పుడూ ఒకే ఏడాదిలో రాలేదు. కనుక ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఇదే ఏడాదిలో వస్తే అరుదైన రికార్డ్‌లు చాలానే నమోదు కావచ్చు.
