కోట్ల రూపాయల దొంగతనాన్ని పట్టించిన పావ్ భాజీ కోరిక... ఎలాగంటే..?
అవును... కర్ణాటకలోని కలబురిగిలో తాజాగా ఓ ఆసక్తికర ఘటనే చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... పావ్ భాజీ తినాలన్న కోరిక, సుమారు రూ.2.15 కోట్ల దొంగతనాన్ని బయటపెట్టింది.
By: Tupaki Desk | 25 July 2025 1:00 AM ISTకాలం కలిసి రాకపోతే, దరిద్ర దేవత తలపై నాట్యం ఆడుతుంటే.. పాము ఎక్కడి నుంచో రానక్కరలేదు, 'తాడే' పామై కరుస్తుందని అంటారు. ఈ క్రమంలో సుమారు రూ.2.15 కోట్ల రూపాయలు దొంగతనం వ్యవహారం.. పావ్ భాజీ తినాలన్న కోరికతో బయటపడిపోయింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నెట్టింట హల్ చల్ చేయడం మొదలుపెట్టాయి.
అవును... కర్ణాటకలోని కలబురిగిలో తాజాగా ఓ ఆసక్తికర ఘటనే చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... పావ్ భాజీ తినాలన్న కోరిక, సుమారు రూ.2.15 కోట్ల దొంగతనాన్ని బయటపెట్టింది. ఈ విషయం తెలిసి నెటిజన్ల కామెంట్లు ఇష్యూ కంటే వైరల్ గా మారుతున్నాయి. ఈ సందర్భంగా స్పందించిన కలబురగి పోలీసు కమిషనర్ ఎస్డీ శరణప్ప.. ఈ వివరాలు వెల్లడించారు.
వివరాళ్లోకి వెళ్తే... కలబురిగిలోని మారాతుల్లా మాలిక్ కు చెందిన బంగారు దుకాణంలో జులై 11న పట్టపగలే నలుగురు వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఇందులో... ప్రధాన సూత్రధారి ఫరూక్ అహ్మద్ మాలిక్ దుకాణం బయట గమనిస్తుండగా.. మిగతా ముగ్గురూ మాస్కులు ధరించి లోపలికి వెళ్లారు. ఈ సందర్భంగా... షాపు యజమాని కాళ్లు, చేతులు కట్టేశారు.
అనంతరం.. తుపాకీతో బెదిరించి.. బలవంతంగా లాకర్ ఓపెన్ చేయించారు. ఆ లాకర్ లో ఉన్న నగలు, నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో... మారాతుల్లా మాలిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన షాపులో డబ్బు, బంగారం దొంగలు ఎత్తుకుపోయారని తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు.
ఇందులో ప్రధాన నిందితుడు ఫరూక్ అహ్మద్... కొంత దూరం వెళ్లి, మళ్లీ వెనక్కి వచ్చి ప్లేట్ పావ్ బాజీ తిన్నాడు. అనంతరం ఆ షాపులో రూ.30 ఫోన్ పే చేశాడు. పోలీసులకు ఆ మాత్రం హిట్ సరిపోదా?... వెంటనే ఆ లావాదేవీ ద్వారా ఫోన్ నెంబర్ ను గుర్తించిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం విచారించారు.
ఈ క్రమంలో... సుమారు 3 కిలోల బంగారం, కొంత నగదును దొంగిలించినట్లు ఫరూక్ అంగీకరించాడు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే... ఫరూక్ అహ్మద్ కూడా ఓ బంగారు దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే ఇటీవల వ్యాపారంలో రూ.40 లక్షల వరకు నష్టం రావడంతో.. దాని నుంచి బయటపడటం కోసం ఈ పనికి పూనుకున్నాడని అంటున్నారు.
ఈ క్రమంలో నిందితుడి నుంచి 2.865 కేజీల బంగారు ఆభరణాలు, రూ.4.80 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. దోపిడీ జరిగిన వెంటనే కొంత బంగారాన్ని కరిగించినట్లు తెలుస్తోంది.
ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... పోలీసులు తిరిగి తన షాపుకు వచ్చి అక్కడ సోదాలు నిర్వహిస్తారేమోన్న భయంతో.. కేవలం 805 గ్రాముల బంగారం, కొంత నగదు పోయినట్లు మారాతుల్లా మాలిక్ ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. దీంతో.. అతడిని కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
