వ్యక్తిగత పోరాటం కాదు.. ఇది మహిళలందరి ఆత్మగౌరవం!
పార్వతి ఎదుర్కొన్న ఆ బ్యాక్‌లాష్ కేవలం ఆమెపై జరిగిన దాడి మాత్రమే కాదు. అది పితృస్వామ్య భావజాలం నుండి వచ్చిన అసహనం అని విశ్లేషకులు భావిస్తారు.
By: Srikanth Kontham | 14 Jun 2026 1:54 PM ISTమలయాళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటిగా గుర్తింపు పొందిన పార్వతి తిరువోతు నటనతోనే కాదు తన అభిప్రాయాలతోనూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం మమ్ముట్టి నటించిన `కసబా` చిత్రంలో మహిళలను కించపరిచేలా ఉన్న డైలాగులపై పార్వతి బహిరంగంగా స్పందించడం అప్పట్లో దక్షిణాది చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారాన్నే రేపింది. ఆ వివాదం గురించి... ఆ తర్వాత తాను ఎదుర్కొన్న విమర్శల గురించి పార్వతి తాజాగా మరోసారి స్పందించింది. ఆనాడు తాను చేసిన పోరాటం తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేశారు. ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా అగ్ర కథానాయకుడి సినిమాలో స్త్రీలను కించపరిచేలా ఉన్న సంభాషణలను తప్పుబట్టడం అంటే? అది సామాన్యమైన విషయం కాదు.
పార్వతి ఆ ధైర్యం చేసినప్పుడు ఆమెపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో దాడి జరిగింది. సదరు హీరో అభిమానులు ఆమెను దారుణంగా ట్రోల్ చేసారు. కెరీర్‌ను నాశనం చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. అయినప్పటికీ పార్వతి వెనకడుగు వేయలేదు. ఆ సమయంలో తాను అనుభవించిన మానసిక ఒత్తిడి కంటే.. పరిశ్రమలో మార్పు రావడం ముఖ్యమని పార్వతి నమ్మారు. `ఆ పోరాటం నా గురించి కాదు. అది మహిళలందరి గురించి అని పేర్కొన్నారు. వెండితెరపై మహిళలను తక్కువ చేసి చూపించే ప్రతి సన్నివేశం, నిజ జీవితంలో స్త్రీల పట్ల సమాజానికి ఉండే దృక్పథాన్ని ప్రభావితం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే ఒక సెలబ్రిటీగా.. ఒక బాధ్యతాయుతమైన నటిగా అలాంటి తప్పులను ఎత్తిచూపడం తన కర్తవ్యంగా భావించానని వివరించారు. తనను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులు మహిళల గొంతును నొక్కే ప్రయత్నంగా అభివర్ణించారు. సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఒక స్టార్ హీరోను లేదా ఒక పెద్ద సినిమాను విమర్శించడం అంటే కెరీర్‌ను రిస్క్‌లో పడేసుకోవడమే. కానీ పార్వతి ఆ రిస్క్ తీసుకుని సరికొత్త చర్చకు నాయకత్వం వహించారు. ఆమె చూపిన ఆ తెగింపు వల్లే మలయాళ ఇండస్ట్రీలో ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ వంటి సంస్థలు బలోపేతం అయ్యాయి. మహిళల భద్రత, పని ప్రదేశంలో వారి గౌరవం , స్క్రిప్ట్ లో జెండర్ సెన్సిటివిటీ వంటి అంశాలపై నిర్మాతలు, దర్శకులు పునరాలోచనలో పడేలా ఆమె వ్యాఖ్యలు ప్రేరేపించాయి.
పార్వతి ఎదుర్కొన్న ఆ బ్యాక్‌లాష్ కేవలం ఆమెపై జరిగిన దాడి మాత్రమే కాదు. అది పితృస్వామ్య భావజాలం నుండి వచ్చిన అసహనం అని విశ్లేషకులు భావిస్తారు. ఒక మహిళ తన అభిప్రాయాన్ని బలంగా చెబితే తట్టుకోలేని మనస్తత్వమే ఆ ట్రోలింగ్‌కు కారణమని పార్వతి నమ్ముతారు. ఆ కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచిన వారికంటే.. తనను వ్యతిరేకించిన వారి వల్లే తాను మరింత శక్తివంతంగా మారానని.. తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం నేర్చుకున్నానని గర్వంగా చెబుతున్నారు.
పార్వతి తిరువోతు అప్పట్లో రేపిన ఆ నిరసన జ్వాల నేటికీ చిత్ర పరిశ్రమలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. సినిమాల్లో మహిళల పాత్రల చిత్రీకరణలో మార్పు రావాలని కోరుకునే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఒక సినిమా హిట్ లేదా ఫ్లాప్ కంటే అది సమాజానికి ఇచ్చే సందేశం , మహిళల పట్ల చూపే గౌరవం ముఖ్యమని ఆమె చేసిన పోరాటం గుర్తు చేస్తుంది. నటిగా మాత్రమే కాకుండా.. సామాజిక మార్పు కోసం నిలబడే యోధురాలిగా పార్వతి తన ముద్రను పదిలం చేసుకున్నారు.
