మెగాస్టార్ డైలాగ్ తప్పుపడితే బెదిరింపులా? ఏం జరిగింది?
సినీ ఇండస్ట్రీలో మహిళల హక్కులు, సిల్వర్ స్క్రీన్ పై ఉమెన్ రోల్స్ క్యారెక్టరైజేషన్ పై బహిరంగంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేసే యాక్ట్రెస్ లు చాలా తక్కువ.
By: M Prashanth | 14 Jun 2026 10:13 PM ISTసినీ ఇండస్ట్రీలో మహిళల హక్కులు, సిల్వర్ స్క్రీన్ పై ఉమెన్ రోల్స్ క్యారెక్టరైజేషన్ పై బహిరంగంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేసే యాక్ట్రెస్ లు చాలా తక్కువ. అలాంటి వారిలో మలయాళ నటి పార్వతి తిరువొతు పేరు ముందుంటుంది. తన ముక్కుసూటి స్వభావంతో ప్రశంసలు అందుకున్న ఆమె.. అదే కారణంగా ట్రోల్స్, బెదిరింపులు కూడా ఎదుర్కొన్నట్లు తాజాగా వెల్లడించారు.
ఇటీవల ఇచ్చిన పార్వతి.. 2016లో జరిగిన ఒక వివాదాన్ని గుర్తు చేసుకున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన కసబా చిత్రంలో మహిళలను కించపరిచేలా ఉన్న కొన్ని డైలాగులు తాను తప్పుబట్టినట్లు చెప్పారు. పెద్ద స్టార్ హీరో చెప్పే డైలాగులు కచ్చితంగా సమాజంపై ప్రభావం చూపుతాయని భావించి తాను స్పందించానని వివరించారు.
అయితే ఆ వ్యాఖ్యల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆమె తెలిపారు. సోషల్ మీడియాలో తన పై ట్రోలింగ్ జరిగిందని, కొందరు అసభ్యకర వ్యాఖ్యలు చేయడమే కాకుండా అత్యాచారం చేస్తామని, చంపేస్తామని బెదిరింపులకు కూడా దిగారని చెప్పారు. ఫోన్ల ద్వారా కూడా బెదిరింపులు వచ్చాయని వెల్లడించారు. దీంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని, ఆ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు గుర్తు చేశారు.
ఆ ఘటన వల్ల చాలా బాధపడ్డానని పార్వతి చెప్పారు. అయితే కొద్ది రోజుల తర్వాత ఇది తన వ్యక్తిగత పోరాటం మాత్రమే కాదని, మహిళల గౌరవం కోసం జరుగుతున్న పోరాటమని అర్థమైందన్నారు. ఆ సమయంలో అనేక మంది మహిళలు తనకు అండగా నిలవడం ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు. కొందరు మేల్ ఆర్టిస్ట్స్ కూడా మద్దతు తెలిపారని చెప్పారు.
ఆ వివాదం కొనసాగుతున్న సమయంలో పార్వతి నటించిన ఉయరే చిత్రం విడుదలైంది. అప్పట్లో బాయ్‌కాట్ పార్వతి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగినా.. ప్రేక్షకులు సినిమాను ఆదరించి విజయాన్ని అందించారని చెప్పారు. వ్యక్తిగత అభిప్రాయం ఎలా ఉన్నా, మంచి యాక్టింగ్ కు కేరళ ప్రేక్షకులు ఎప్పుడూ వాల్యూ ఇస్తారని పేర్కొన్నారు.
2017లో కేరళలో ఓ ప్రముఖ నటిపై జరిగిన కిడ్నాప్, లైంగిక దాడి ఘటన తర్వాత ఇండస్ట్రీలో మహిళల సెక్యూరిటీ విషయంపై మరింత గట్టిగా మాట్లాడడం ప్రారంభించానని పార్వతి తెలిపారు. అన్యాయాలను ప్రశ్నించడం తన బాధ్యతగా భావిస్తానని చెప్పారు. అయితే ఆ జర్నీ అంత ఈజీ కాదని, తన వాయిస్ ను ఆపడానికి, పరిశ్రమ నుంచి దూరం పెట్టడానికి కొందరు ప్రయత్నించాకని ఆరోపించారు. ఆ పరిస్థితులు భయపెట్టినా.. వెనక్కి తగ్గే ఆలోచన మాత్రం రాలేదన్నారు.
"నిజాయితీగా అనిపించిన విషయాన్ని చెప్పడంలో నేను వెనుకాడను. నా ఆత్మసాక్షికి కట్టుబడి ఉంటాను. తప్పుగా అనిపిస్తే భవిష్యత్తులో కూడా ప్రశ్నిస్తాను" అని పార్వతి స్పష్టం చేశారు. బెంగళూరు డేస్, టేక్ ఆఫ్, చార్లీ, తంగలాన్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న పార్వతి.. తెలుగు ప్రేక్షకులకు దూత వెబ్ సిరీస్ ద్వారా మరింత చేరువయ్యారు. ప్రస్తుతం మలయాళంలో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె.. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నిర్మిస్తున్న ది స్టోర్మ్ వెబ్ సిరీస్ తో హిందీ ఓటీటీ వరల్డ్ లోకి అడుగుపెట్టనున్నారు.
