ప్రభుత్వాన్ని నిలదీసిన మాలీవుడ్ రెబల్ క్వీన్
మలయాళ ఆర్టిస్టుల సంఘం (అమ్మా) మాజీ అధ్యక్షుడు మోహన్ లాల్ సహా చాలా మందిని పార్వతి సూటిగా ప్రశ్నించిన సందర్భాలున్నాయి.
By: Tupaki Desk | 5 Jun 2025 10:09 AM ISTప్రశ్నించేవారికి అవకాశాలిచ్చేది ఎవరు? ప్రశ్నలోనే ఉంది జవాబు. ప్రశ్నించే, నిలదీసేవారిని ఎవరైనా దరి చేరనిస్తారా? ప్రస్తుతం అలాంటి సన్నివేశాన్ని ఎదుర్కొంటోంది మలయాళ రెబల్ క్వీన్ పార్వతి తిరుమోతు. ఈ నటి తనకు అవకాశాల్లేకుండా అనధికారికంగా బ్యాన్ చేరని భావిస్తున్నట్టు గతంలో ఆవేదన చెందారు. కానీ ఇప్పటికీ తన ప్రశ్నించే పంథాను విడువలేదు.
మలయాళ ఆర్టిస్టుల సంఘం (అమ్మా) మాజీ అధ్యక్షుడు మోహన్ లాల్ సహా చాలా మందిని పార్వతి సూటిగా ప్రశ్నించిన సందర్భాలున్నాయి. ఇక ఇప్పుడు మరోసారి పార్వతి నేరుగా పినరయి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారు.
మలయాళ చిత్ర పరిశ్రమలోని వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించడానికి ఐదు సంవత్సరాల క్రితం సమర్పించిన హేమా కమిటీ నివేదిక సిఫార్సులపై కేరళ ప్రభుత్వం చాలా కాలంగా పట్టించుకోవడం లేదని నటి పార్వతి తిరువోతు విమర్శించారు. కమిటీ సూచనల స్థితిపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను తన ఇన్ స్టాలో నేరుగా ప్రశ్నించారు. ఈ కమిటీ ఏర్పడటానికి అసలు కారణం ఏమిటి? పరిశ్రమలో నిబంధనలను రూపొందించడంలో సహాయపడటానికి విధానాలను అమలు చేయడం కోసమేనా? అని ప్రశ్నించారు పార్వతి.
నివేదిక సమర్పించి కేవలం ఐదున్నర సంవత్సరాలు మాత్రమే అయింది కాబట్టి తొందరపడాల్సిన అవసరం లేదు! అంటూ సెటైర్ వేసారు. హేమ కమిటీ కేసులను దర్యాప్తు చేస్తున్న సిట్ కూడా త్వరగా కేసులన్నిటినీ మూసేయాలని భావిస్తోందని ఇటీవల మాలీవుడ్ మీడియాలో కథనాలొచ్చాయి. అదే క్రమంలో పార్వతి ప్రశ్నలు చర్చగా మారాయి.
అయితే పార్వతి ప్రశ్నకు కారణం.. చాలా మంది నటీమణులు తమ కేసులను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకోవడమే. ఎవరూ కేసులతో ముందుకు వెళ్లాలని అనుకోవడం లేదని సిట్ కోర్టుకు నివేదించింది. మరోవైపు ఫిల్మ్ ఎడిటర్, ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (WCC) సభ్యురాలు బీనా పాల్ ప్రభుత్వం డిలే చేయడానికి కారణాలున్నాయని అన్నారు. ఇది కేవలం హేమ కమిటీ నివేదించిన సమస్యల గురించే కాదు. ఇంకా చాలా విషయాలపై దృష్టి సారించిన ప్రక్రియ అని అన్నారు. కేసులతో ముందుకు వెళ్లకూడదని అనుకుంటే దానిని అర్థం చేసుకోగలం. కానీ కేసులతో ముందుకు సాగుతున్న వారు చాలా మంది ఉన్నారు.. అని పాల్ అన్నారు.
