Begin typing your search above and press return to search.

ఇక నా వల్ల కాదు... గుడ్‌ బై!

సోషల్‌ మీడియా వల్ల ఎంతో మంది సెలబ్రిటీలుగా మారుతున్నారు. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో లేక పోవడంను చాలా పెద్ద సమస్యగా చూస్తున్నారు.

By:  Ramesh Palla   |   23 April 2026 11:20 AM IST
ఇక నా వల్ల కాదు... గుడ్‌ బై!
X

సోషల్‌ మీడియా వల్ల ఎంతో మంది సెలబ్రిటీలుగా మారుతున్నారు. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో లేక పోవడంను చాలా పెద్ద సమస్యగా చూస్తున్నారు. అందుకే కొత్త, పాత అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్‌ మీడియాలో ఉంటున్నారు. సెలబ్రిటీలకు ముఖ్యంగా సినిమా వాళ్లకు, రాజకీయ నాయకులకు ఎంతగా అయితే సోషల్‌ మీడియా ఉపయోగపడుతుందో అదే స్థాయిలో ఇబ్బందులకు గురి చేస్తోంది. సోషల్‌ మీడియాలో ప్రతి ఒక్క సెలబ్రిటీ ఏదో ఒక సమయంలో ట్రోల్స్‌ ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరు కావాలని ట్రోల్‌ చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో కొందరిని కొందరు డబ్బులు ఇచ్చి మరీ ట్రోల్‌ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అది ఎందుకు అనేది వారు చేస్తున్న పని, ప్రాజెక్ట్‌లపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు బాలీవుడ్‌ సెలబ్రిటీ పార్థ్‌ సమతాన్‌ తీవ్రమైన ట్రోల్స్ కారణంగా ఏకంగా సోషల్‌ మీడియాకు గుడ్‌ బై చెప్పాడు.

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పార్థ్‌ సమతాన్‌...

హిందీ బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన పార్థ్‌ సమతాన్‌ సోషల్‌ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన తన బాధను వ్యక్తం చేశాడు. సోషల్‌ మీడియాలో కొందరు నకిలీ ఖాతాలు క్రియేట్‌ చేసి మరీ తనను టార్గెట్‌ చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో పార్థ్‌...నేను ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి అనుకునే వ్యక్తిని. ప్రతి ఒక్కరి పట్ల సానుకూలంగా ఉంటూ, మంచి విషయాలను గురించి ప్రచారం చేస్తూ, కేవలం మంచి విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాను. కానీ ఇటీవల ఎవరో కొందరు నకిలీ ఖాతాలను కొనుగోలు చేసి మరీ నన్ను, నా కుటుంబంను టార్గెట్‌ చేశారు. నా గురించి, నా కుటుంబం గురించి చెత్త వ్యాఖ్యలు చేస్తున్నారు. వారు చేస్తున్న ఆ చెత్త వ్యాఖ్యల వల్ల నేను, నా కుటుంబ సభ్యులం అందరం తీవ్రమైన మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నాం.

కావాలని చేస్తున్న ట్రోల్స్‌తో...

ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తి ఎవరో నాకు తెలుసు అనుకుంటున్నాను. అయితే ఆ వ్యక్తి పేరును నేను బయటకు చెప్పలేను. అతడి నుంచి దూరంగా ఉండటం కోసం నేను మొత్తం సోషల్‌ మీడియాకు దూరం కావాలని అనుకుంటున్నాను. నన్ను టార్గెట్‌ చేస్తున్న వారి నుంచి కాపాడుకోవడం కోసం, నా ఫ్యామిలీని మానసికంగా ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో సోషల్‌ మీడియాకు గుడ్‌ బై చెప్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. గత కొన్నాళ్లుగా అనుభవించిన ఇబ్బందులు చాలు, కావాలని నన్ను టార్గెట్‌ చేస్తున్న వారి వల్ల పడ్డ క్షోభ చాలు. ఇంకా వీటిని భరించడం నాకు, నా ఫ్యామిలీకి సాధ్యం కావడం లేదు. వీటన్నింటికి దూరంగా ఉండే ఉద్దేశంతో తాను పూర్తిగా సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చాను అంటూ పోస్ట్‌ చేశాడు. అయితే పార్థ్‌ చెప్పిన వ్యక్తి ఎవరు అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

సోషల్‌ మీడియాకు దూరంగా....

నటుడిగా మోడల్‌గా సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్న పార్థ్‌ సమతాన్‌ కి ఇలాంటి పరిస్థితి ఎదురు కావడంపై ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా నుంచి దూరంగా జరిగే బదులుగా పోలీసులను ఆశ్రయించి, తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం పై ఫిర్యాదు చేయవచ్చు కదా అంటూ కొందరు సలహా ఇస్తున్నారు. పదే పదే ట్రోల్‌ చేస్తున్నారు అంటే అది కావాలని కొందరు పనిగట్టుకుని చేస్తున్నట్లు భావించొచ్చు. అలాంటి వాటిని ఉపేక్షించి, భయపడి సోషల్‌ మీడియాకు దూరంగా జరగడం ఏంటి అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కెరీర్‌ పై దృష్టి పెట్టడం కోసం ట్రోల్స్ నుంచి దూరంగా జరిగి సోషల్‌ మీడియాకు గుడ్‌ బై చెప్పడం ఉత్తమం అని కూడా కొందరు అంటున్నారు. మొత్తానికి సోషల్‌ మీడియాకు పార్థ్‌ సమతాన్‌ గుడ్‌ బై చెప్పడం చర్చనీయాంశంగా మారింది.