హీరోయిన్ భర్తకు ప్రధాని కావాలని ఉందా..!
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో నెపో కిడ్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు, గౌరవంను దక్కించుకుంది.
By: Tupaki Desk | 28 July 2025 2:11 PM ISTబాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో నెపో కిడ్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు, గౌరవంను దక్కించుకుంది. సొంతంగానే ఇండస్ట్రీలో స్టార్‌గా ఎదిగింది. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. పలు ఇంటర్వ్యూల్లో పరిణీతి చోప్రా పెళ్లి గురించి మాట్లాడుతూ తనకు కాబోయే వాడి గురించి చెప్పడం జరిగింది. ఆ సమయంలో తనకు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి భర్తగా వద్దు అంటూ చెప్పుకొచ్చింది. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన పరిణీతి చోప్రా అనూహ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే.
ప్రేమించుకున్న పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా పెద్దలను ఒప్పించి 2023 సెప్టెంబర్‌లో వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ లీలా ప్యాలెస్‌లో వీరి వివాహం వైభవంగా జరిగింది. పెళ్లి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దాల యొక్క జోడీ గురించి సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ వినిపిస్తూనే ఉంటుంది. సాధారణంగా రాజకీయ నాయకుడు అంటే పెద్దగా అందంగా ఉండరు అంటారు. కానీ రాఘవ్ చద్దా చాలా మంది బాలీవుడ్ హీరోలతో పోల్చితే అంతకు మించి అందంగా ఉంటాడని నెటిజన్స్ చాలా సందర్భాల్లో, చాలా సార్లు కామెంట్స్ చేయడం జరిగింది. పరిణీతి చోప్రాకు జోడీగా హీరోగా నటించినా రాఘవ్ చద్దా సరిగ్గా సెట్ అవుతాడని కూడా చాలా మంది అంటూ ఉంటారు.
తాజాగా ఈ బ్యూటీఫుల్ కపుల్ ప్రముఖ టాక్ షో కపిల్ శర్మ షో లో పాల్గొన్నారు. ఆ సమయంలో తమ ప్రేమ కథను, తమ పెళ్లి విశేషాలను, వ్యక్తిగత విషయాలను వెల్లడించారు. పరిణీతి మాట్లాడుతూ.. మొదటి సారి రాఘవ్ ను లండన్‌లో కలిశాను, ఆ సమయంలో పరిచయం జరిగింది. ఆ వెంటనే ఇంటికి వెళ్లిన తర్వాత రాఘవ్ హైట్ ఎంత అనే విషయాన్ని గూగుల్‌లో చూశాను అంది. అతడితో స్నేహం కాస్త ప్రేమకు దారి తీసిందని అంది. ఇక రాఘవ్ చద్దా మాట్లాడుతూ... పరిణీతి ఏం మాట్లాడినా దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది. గతంలో తాను చాలా సార్లు రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను అంది. కానీ దానికి విరుద్దంగా ఆమె ఒక ఎంపీనే పెళ్లి చేసుకుందని రాఘవ్ చెప్పగానే అంతా గట్టిగా నవ్వారు.
పరిణీతి అనుకున్నది రివర్స్‌లో జరుగుతూ ఉంటుంది కనుక ఆమెతో ఎప్పుడూ... 'రాఘవ్ ఎప్పటికీ ప్రధాని కాలేడు' అనిపిస్తూ ఉంటాను అని రాఘవ్ అన్నాడు. రాఘవ్ అన్న మాటలతో ఒక్కసారిగా అంతా గట్టిగా నవ్వేశారు. పరిణీతి అలా అనడం వల్ల రివర్స్ గా జరిగి తాను ప్రధాని అవుతానేమో అని రాఘవ్ భావిస్తున్నాడట. అతడి కామెడీ సెన్సాఫ్ హ్యూమర్‌కి అంతా ఫిదా అవుతున్నారు. అదే సమయంలో ఈ ఆప్ ఎంపీకి చాలా పెద్ద కోరిక ఉంది, ఇతడు భవిష్యత్తులో ప్రధాని కావాలని కోరుకుంటున్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి కామెడీ షో లో రాఘవ్ చేసిన కామెడీ కామెంట్స్ కాస్త చర్చనీయాంశం అయ్యాయి. పెళ్లి తర్వాత పరిణీతి ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు. ముందు ముందు అయినా ఆమె నటిగా బిజీ అయ్యేనా చూడాలి.
