లాబీయింగ్ కారణంగా జాతీయ అవార్డ్ కోల్పోయా
ప్రస్తుత ప్రపంచంలో లాబీయింగ్ లేనిదే ఏదీ లేదు! ఆస్కార్ అవార్డుల్లోను లాబీయింగ్ చేయనిదే పురస్కారం అందుకోవడం అసాధ్యమని చెబుతారు.
By: Tupaki Desk | 28 April 2025 9:59 AM ISTప్రస్తుత ప్రపంచంలో లాబీయింగ్ లేనిదే ఏదీ లేదు! ఆస్కార్ అవార్డుల్లోను లాబీయింగ్ చేయనిదే పురస్కారం అందుకోవడం అసాధ్యమని చెబుతారు. అకాడెమీ అవార్డులపై ప్రపంచస్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి. ప్రతిష్టాత్మక పురస్కారాలు గెలుచుకోవాలంటే ప్రమోషన్స్ కోసమే కొన్ని కోట్లు ఖర్చు చేయాలి. కొన్నిసార్లు ఒరిజినల్ ట్యాలెంట్ కు గుర్తింపు దక్కినా కానీ, లాబీయింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే భారతదేశంలో ఇచ్చే జాతీయ అవార్డులకు సైతం లాబీయింగ్ లేనిదే పని కాదని చాలా మంది తారలు, ప్రముఖులు అంగీకరిస్తున్నారు. ఇక్కడ నీచ రాజకీయాలు ఉంటాయని ఘాటుగా విమర్శించారు నటుడు పరేష్ రావల్. ఈ సీనియర్ నటుడు 90లలో తనకు ఎదురైన అనుభవం గురించి తాజా ఇంటర్వ్యూలో ముచ్చటించారు.
అప్పట్లో తాను నటించిన `సర్ధార్` చిత్రంలో నటనకు గాను తనకు జాతీయ అవార్డు వస్తుందని సహచరులు చెప్పారని, కానీ మహేష్ భట్ తెరకెక్కించిన `సర్` చిత్రానికి జాతీయ అవార్డ్ వచ్చిందని గుర్తు చేసుకున్నారు. మొదట్లో నేను నటించిన `సర్ధార్` కూడా రేసులో ఉంది. కానీ మేము లాబీయింగ్ చేయలేకపోయాము. అప్పటి ప్రముఖ నిర్మాత ఒకరు లాబీయింగ్ చేయనిదే అవార్డు దక్కదని తనతో అన్నట్టు పరేష్ రావల్ పేర్కొన్నారు.
`సర్` చిత్రానికి అవార్డ్ వచ్చిందని ముఖేష్ భట్ నాకు కాల్ చేసి చెప్పారు. అయితే ఆ తర్వాత కల్పనా లాజ్మీ నా సినిమా సర్ధార్ కి ఉత్తమ నటుడు అవార్డ్ వస్తుందని అన్నారు. దాంతో నేను గందరగోళంలో పడ్డాను! అని పరేష్ రావల్ నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. కానీ చివరకు తాను ఆశించిన అవార్డ్ దక్కలేదని పరేష్ ఆవేదన చెందారట. లాబీయింగ్ చేయనిదే ఇక్కడ పురస్కారం దక్కదని ప్రముఖ తెలుగు నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి స్వయంగా ఆయనకు వివరించారట. పరేష్ రావల్ తెలుగు తమిళం హిందీలో పాపులర్ నటుడు. అతడు మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్ లో నటించిన సంగతి తెలిసిందే.
