ఈ నటుడికి మీడియా ఒక సర్కస్‌లా కనిపిస్తోందట
ఇదే ఇంటర్వ్యూలో పరేష్ రావల్ మీడియా సర్కస్ గురించే కాకుండా తన రాజకీయ జీవితం గురించి కూడా ఆసక్తికర విషయాలను తెలియజేసారు.
By: Sivaji Kontham | 17 July 2026 8:00 PM ISTముక్కు సూటిగా మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షించే నటులు కొందరు ఉన్నారు. అలాంటి వారిలో పరేష్ రావల్ ఒకరు. ఆర్జీవీ తరహాలోనే ఆయన కూడా సూటిగానే వ్యవహరిస్తుంటారు. కొన్నేళ్ల క్రితం జరిగిన ఘటనే అయినా.. యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత మీడియా ప్రదర్శించిన అత్యుత్సాహంపై పరేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2020లో సుశాంత్ మరణం తర్వాత టీవీ ఛానెళ్లలో వచ్చిన వార్తా కవరేజీని తాను ఎంతగానో అసహ్యించుకున్నానని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన పరేష్ రావల్.. ఈ వ్యవహారాన్ని నిర్మొహమాటంగా తూర్పారబట్టారు.
కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో దేశంలో నెలకొన్న పరిస్థితులు..ముఖ్యంగా న్యూస్ ఛానెళ్లలో చూపించిన కంటెంట్ వల్ల తన బ్లడ్ ప్రెజర్ (BP) పెరిగిందని...అందువల్లే తాను టీవీ వార్తలకు దూరంగా ఉన్నానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో సుశాంత్ సింగ్ కేసును మీడియా కవర్ చేసిన విధానాన్ని ఒక `సర్కస్` అని అభివర్ణించిన ఆయన, ఆ వ్యవహార శైలి తనకు తీవ్ర అసహ్యం కలిగించిందని చెప్పారు. ఒక యువ నటుడి మరణాన్ని పబ్లిసిటీ కోసం వాడుకున్న తీరుపై ఆయనలో ఉన్న వ్యతిరేకత ఈ వ్యాఖ్యల ద్వారా బయటపడింది.
ఇదే ఇంటర్వ్యూలో పరేష్ రావల్ మీడియా సర్కస్ గురించే కాకుండా తన రాజకీయ జీవితం గురించి కూడా ఆసక్తికర విషయాలను తెలియజేసారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అహ్మదాబాద్ ఈస్ట్ నియోజకవర్గం నుండి బీజేపీ ఎంపీగా గెలిచిన ఆయన.. ఆ తర్వాత రాజకీయాలకు ఎందుకు దూరమయ్యారో వివరించారు. రాజకీయాల్లో క్షేత్రస్థాయి వాస్తవాలు.. పనిభారం, నిరంతరం చేయాల్సిన ప్రయాణాలు తాను ఊహించిన దానికి భిన్నంగా ఉన్నాయని అంగీకరించారు. రాజకీయం అనేది పూర్తి నిబద్ధతను కోరే ఒక ఉదాత్తమైన వృత్తి అని... అయితే ఆ రంగం తన లాంటి వాళ్లకు సెట్ కాదని భావించి.. ఒక నిర్దిష్ట లక్ష్యం కోసమే వచ్చి ఆ తర్వాత తప్పుకున్నానని ఆయన స్పష్టం చేశారు.
రాజకీయాల్లో కొనసాగితే తన వ్యక్తిత్వాన్ని.. నిజాయితీని కోల్పోవాల్సి వస్తుందనే భయం కూడా పరేష్ రావల్‌ను వెంటాడింది. వ్యవస్థ ఎలా పనిచేస్తుందనే దానిపై తనకు పూర్తి అవగాహన లేకపోవడం వల్ల.. ప్రజలకు చేయలేని వాగ్దానాలను చేయాల్సి వస్తుందని ఆందోళన చెందానని తెలిపారు. ప్రజల సమస్యలను చూసి 'చేస్తాను.. చేస్తాను' అని రెండు మూడు సార్లు అబద్ధాలు చెబితే... లోపల తన అంతరాత్మ ఒక అబద్ధాల కోరుగా మారిపోతుందని.. అది ఒక నటుడిగా తన నైపుణ్యాన్ని (క్రాఫ్ట్) కూడా దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే అబద్ధాలు చెప్తూ బ్రతకడం కంటే... దశాబ్దాల కాలంగా తాను శ్రమిస్తున్న నటన వైపే మళ్లీ అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తన క్రాఫ్ట్ (నటన) పై తనకు కొంతవరకు నియంత్రణ వచ్చిందని... అందుకే పాలిటిక్స్ నుండి బయటకు వచ్చి పూర్తి దృష్టిని సినిమాలపైనే పెడుతున్నానని ఆయన వివరించారు. ఈ విధంగా మీడియాలోని అతిని.. రాజకీయాల్లోని అసలైన వాస్తవాలను ఒక సీనియర్ నటుడిగా పరేష్ రావల్ ఎండగట్టారు. 'హేరాఫేరి' ఫ్రాంఛైజీలో బాబూరావుగా అలరించిన పరేష్ .. అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో డాక్టర్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. వెంకటేష్- ఆర్జీవీ `క్షణక్షణం` చిత్రంలో విలన్ పాత్రలోను మెప్పించారు.
