వణుకు పుట్టించే హారర్ కామెడీతో కమెడియన్
బాలీవుడ్ కమెడియన్, అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పరేష్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
By: Tupaki Desk | 13 May 2025 8:30 AMబాలీవుడ్ కమెడియన్, అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పరేష్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల తాను అనారోగ్యానికి గురైన సందర్భంలో డాక్టర్ సలహా మేరకు తన మూత్రాన్ని తానే తాగానని, తద్వారా తన ఆరోగ్యం కుదుటపడిందని, తిరిగి సెట్టయ్యానని ఇటీవల పరేష్ రావల్ వెల్లడించి అందరిని షాక్‌కు గురి చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు.
గత ఏడాది కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించిన పరేష్ రావల్ 2025, 2026 సంవత్సరాలకు గానూ క్రేజీ లైనప్‌తో బిజీగా మారిపోయారు. ఈ రెండేళ్లకు గాను ఆయన చేతిలో ఏకంగా ఎనిమిది సినిమాలున్నాయి. ఇందులో మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న రెండు క్రేజీ సినిమాలున్నాయి. అవే హేరా ఫేరీ 3, భూత్ బంగ్లా. ఈ రెండు సినిమాల్లోనూ ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు.
ఇప్పటి వరకు అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన సినిమాల్లో పరేష్ రావల్ కీలక పాత్రల్లో కనిపించాడు. అక్షయ్‌తో కలిసి దాదాపు 21 సినిమాల్లో పరేష్ రావల్ నటించడం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా ఓ బాలీవుడ్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన పరేష్ రావల్ `భూత్ బంగ్లా` మూవీతో పాటు హీరో అక్షయ్ కుమార్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్షయ్‌తో కలిసి చాలా సినిమాల్లో నటించారు కదా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పిడి ఉంటుందని అడిగితే తను నా కో స్టార్ మాత్రమేనని చెప్పడం అక్షయ్ కుమార్ అభిమానుల్ని షాక్‌కు గురి చేసింది.
అంతే కాకుండా ప్రియదర్శన్ డైరెక్షన్‌తో తను నటిస్తున్న `భూత్‌బంగ్లా` గురించి మాట్లాడుతూ ఇదొక అద్భుతమైన చెత్త హారర్ కామెడీ అని అభివర్షించాడు. దీంతో ఈ మూవీ 2026లో రానున్న అత్యంత వణుకు పుట్టించే హారర్ మూవీగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కామెడీని పండిస్తూనే ఈ సినిమా వెన్నులో వణుకు పుట్టిస్తుందని తెలుస్తోంది.