Begin typing your search above and press return to search.

బాబూరావ్ పాత్ర‌కు బ్ర‌హ్మీ బెస్ట్ ఆప్ష‌న్?

బాబూజీ అలియాస్ బాబూరావు.. 'హేరాఫేరి' ఫ్రాంఛైజీకి గౌర‌వం పెంచిన పాత్ర ఇది. బాబూరావుగా సోడా బుడ్డి క‌ళ్ల‌ద్దంతో ప‌రేష్ రావ‌ల్ పండించిన హాస్యం అంతా ఇంతా కాదు.

By:  Tupaki Desk   |   21 May 2025 7:42 AM
బాబూరావ్ పాత్ర‌కు బ్ర‌హ్మీ బెస్ట్ ఆప్ష‌న్?
X

బాబూజీ అలియాస్ బాబూరావు.. 'హేరాఫేరి' ఫ్రాంఛైజీకి గౌర‌వం పెంచిన పాత్ర ఇది. బాబూరావుగా సోడా బుడ్డి క‌ళ్ల‌ద్దంతో ప‌రేష్ రావ‌ల్ పండించిన హాస్యం అంతా ఇంతా కాదు. అందుకే కామెడీ ఫ్రాంఛైజీలో బాబూరావు గణపత్ రావ్ ఆప్టే ద‌శాబ్ధాల పాటు ప్రేక్ష‌క‌దేవుళ్ల‌ మ‌న‌సుల్లో ఉండిపోయాడు.

అయితే అలాంటి పాత్ర‌ధారి స‌డెన్ షాక్ ఇవ్వ‌డం ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 'హేరాఫేరి 3' చిత్రీక‌ర‌ణ‌ను ప్రియ‌ద‌ర్శ‌న్ ప్రారంభించేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌గా, ఈ పాత్ర నుంచి నిష్కృమిస్తున్నాన‌ని ప‌రేష్ రావ‌ల్ ప్ర‌క‌టించ‌డంతో అంద‌రూ షాక్ కి గుర‌య్యారు. ఆక‌స్మాత్తుగా అత‌డు ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో నిర్మాత‌ల్లో ఒక‌రైన అక్ష‌య్ కుమార్ ఏకంగా 25కోట్ల‌కు ప‌రేష్ రావ‌ల్‌పై దావా వేయ‌డంపైనా చ‌ర్చ సాగుతోంది.

ఇప్పుడు ఈ కీల‌క‌ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తే బావుంటుంది? అన్న చ‌ర్చ సాగుతోంది. భార‌త‌దేశంలో ప్ర‌తిభావంతులైన న‌టుల‌ను ప‌రిశీలిస్తే, అందులో టాలీవుడ్ నుంచి బ్ర‌హ్మానందం పేరును కూడా అభిమానులు సూచిస్తున్నారు. అటు హిందీ చిత్ర‌సీమ‌లో పంక‌జ్ త్రిపాఠి లేదా నానా ప‌టేక‌ర్ వంటి ప్ర‌ముఖులు కూడా రేసులో ఉన్నారు. వీరంతా ప‌రిశ్ర‌మ‌లో దిగ్గ‌జ న‌టులు. ఎలాంటి పాత్ర‌లో అయినా ఒదిగిపోయి న‌టించ‌గ‌ల స‌మ‌ర్థులు. అయితే ఇటీవ‌లి పాన్ ఇండియా ట్రెండ్ లో హిందీ ప‌రిశ్ర‌మ తెలుగు న‌టుల‌ను ఎంపిక చేసేందుకు ఆస‌క్తిగా ఉంది. పాన్ ఇండియ‌న్ మార్కెట్ కి అత్యంత కీల‌క‌మైన తెలుగు రాష్ట్రాల వ‌సూళ్లు కూడా అత్య‌వ‌స‌రంగా మారాయి. అందువ‌ల్ల ప్రియ‌ద‌ర్శ‌న్ బ్ర‌హ్మీని ఎంపిక చేసుకుంటే స‌రైన ఆప్ష‌న్ అని కూడా సూచిస్తున్నారు. సోడా బుడ్డి క‌ళ్ల‌ద్దంతో గొప్ప పెర్ఫామెన్స్ చేసిన అనుభ‌వం కూడా బ్ర‌హ్మానందంకి ఉంది.

వెయ్యి చిత్రాల రారాజు, కింగ్ ఆఫ్ కామెడీ బ్ర‌హ్మానందం అటు ఉత్తరాది ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచిత‌మే గ‌నుక ఇది 'హేరాఫేరి 3' కి క‌లిసొస్తుంద‌ని విశ్లేషిస్తున్నారు. అయితే బ్ర‌హ్మానందం లాంటి న‌టుడు ఒక పాత్ర‌ను అంగీక‌రించాలి అంటే అందులో చాలా ద‌మ్ము ఉండాలి. ఏదో ఒక చెత్త పాత్ర‌తో త‌న వ‌ద్ద‌కు వ‌చ్చే ద‌ర్శ‌కుల‌కు అత‌డు నో చెబుతున్నారు. ఒక సీనియ‌ర్ న‌టుడిగా బ్ర‌హ్మానందం త‌న‌వైపు వ‌చ్చే ప్ర‌తి అవ‌కాశాన్ని ఓకే చేయ‌డం లేదు.