Begin typing your search above and press return to search.

'పాపం ప్రతాప్'.. రిలీజ్ కు ముందు సమస్యేంటి?

అయితే చివరి నిమిషంలో వచ్చిన సాంకేతిక సమస్యల కారణంగా ఆ ప్రీమియర్లు రద్దు అయ్యాయి.

By:  M Prashanth   |   16 April 2026 3:56 PM IST
పాపం ప్రతాప్.. రిలీజ్ కు ముందు సమస్యేంటి?
X

టాలీవుడ్‌ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్ హీరోగా నటించిన తాజా చిత్రం పాపం ప్రతాప్ విడుదలకు ముందే అనుకోని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలకు సిద్ధమైన ఆ సినిమా కోసం మేకర్స్ ఈరోజు (ఏప్రిల్ 16) రాత్రి పెయిడ్ ప్రీమియర్లను ప్లాన్ చేశారు. అయితే చివరి నిమిషంలో వచ్చిన సాంకేతిక సమస్యల కారణంగా ఆ ప్రీమియర్లు రద్దు అయ్యాయి.

ఆ పరిస్థితికి ప్రధాన కారణం యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ సర్టిఫికెట్ ఆలస్యం కావడమేనని సమాచారం. సినిమాలో కొన్ని జంతువులకు సంబంధించిన సన్నివేశాలు ఉండటంతో, సెన్సార్ క్లియరెన్స్ కోసం ఆ సర్టిఫికెట్ తప్పనిసరి అయింది. సాధారణంగా సినిమా షూటింగ్‌ లో ఏ జంతువుకూ హాని జరగలేదని నిర్ధరిస్తూ యానిమల్ బోర్డ్ నుంచి అనుమతి పొందాలి. అయితే ఆ ప్రక్రియ చివరి దశలో నిలిచిపోవడంతో సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి కాలేదు.

దీంతో గురువారం రాత్రి పడాల్సిన ప్రీమియర్ షోలను నిలిపివేయాల్సి వచ్చింది. మేకర్స్ ప్రస్తుతం ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం షోల నుంచి సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర బృందం కృషి చేస్తోంది. అయితే సర్టిఫికెట్ సమయానికి వస్తుందా లేదా అన్నది కీలకంగా మారింది.

పాపం ప్రతాప్ సినిమా విషయంలో హీరో తిరువీర్ చాలా ఆశలు పెట్టుకున్నారు. తన గత చిత్రాలకు విమర్శకుల ప్రశంసలు వచ్చినప్పటికీ, థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదని ఆయన గతంలోనే పలు సందర్భాల్లో చెప్పారు. ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ లో తన సినిమాలకు మంచి స్పందన వస్తోందని, కానీ థియేటర్లలో అదే స్థాయి సక్సెస్ రావడం లేదని తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో పాపం ప్రతాప్ తో థియేటర్లలో హిట్ కొట్టాలని తిరువీర్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. అందుకే ముందుగానే ప్రీమియర్లు కూడా ప్లాన్ చేశారు. కానీ, చివరి నిమిషంలో యానిమల్ సర్టిఫికెట్ ఇబ్బంది తలెత్తడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు పాపం తిరువీర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ చిత్రాన్ని దుర్గా నరేష్ దర్శకత్వంలో రూపొందించారు.

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌ గా తెరకెక్కిన ఆ సినిమా కథ 1990ల చివరలో గోదావరి ప్రాంతం నేపథ్యంలో సాగుతుంది. పెళ్లైన నాలుగు రోజులకే భార్య వెళ్లిపోవడంతో హీరో ఎదుర్కొనే పరిస్థితులను ఫన్నీగా చూపించనున్నారు. ఏదేమైనా ఇప్పుడు అందరి దృష్టి యానిమల్ బోర్డ్ సర్టిఫికెట్‌ పై నిలిచింది. అది సమయానికి వస్తేనే సినిమా నిర్ణయించిన తేదీకి విడుదల అవుతుంది. లేకపోతే వాయిదా పడే అవకాశం ఉంది. మరి ఆ అడ్డంకిని అధిగమించి పాపం ప్రతాప్ థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందో చూడాలి.