దారి తప్పిన పాన్ ఇండియా ప్రయత్నం?
పాన్ ఇండియా ట్రెండ్ లో ప్రతిదీ మారిపోయింది. ఇప్పుడు ఎవరికి వారు తమ సినిమాలను పాన్ ఇండియా అప్పీల్ తో రూపొందించాలని తపిస్తున్నారు.
By: Tupaki Desk | 6 Jun 2025 7:00 AM ISTపాన్ ఇండియా ట్రెండ్ లో ప్రతిదీ మారిపోయింది. ఇప్పుడు ఎవరికి వారు తమ సినిమాలను పాన్ ఇండియా అప్పీల్ తో రూపొందించాలని తపిస్తున్నారు. దీనికోసం భారీ కాన్సెప్టులను ఎంచుకుని, భారీ కాస్టింగు, హాలీవుడ్ సాంకేతిక నిపుణులను బరిలో దించి చాలా ప్రయోగాలు చేస్తున్నారు. మంచి కంటెంట్, మంచి కాన్సెప్ట్ ఉంటే, ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో కలిసి మంచి ఔట్ పుట్ తీసుకుంటే, ప్రతి సినిమాని పాన్ ఇండియాలో మార్కెట్ చేయగలమనే ధీమా పెరిగింది. టాలీవుడ్, శాండల్వుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సహా అన్ని పరిశ్రమల్లో ఈ ట్రెండ్ కనిపిస్తోంది. అయితే హీరో రేంజును మించి కాన్వాసును అమాంతం పెంచేయడం సరైనదేనా?
పాన్ ఇండియా ఫీవర్ పెద్ద మార్కెట్ ఉండే అగ్ర హీరోల వరకూ పరిమితమైతే ఓకే కానీ, ఇప్పుడు చిన్న హీరోలను కూడా ఇది ఊపేస్తోంది. ఎంతగా ఈ ఊపు కనిపిస్తోంది అంటే, తమ మార్కెట్ రేంజును మించి మూడు నాలుగు రెట్లు అదుపు తప్పిన బడ్జెట్ పెట్టించేంతగా పరిస్థితి దిగజారిందని విశ్లేషిస్తున్నారు. టాలీవుడ్ లో ప్రముఖ యువ హీరో మార్కెట్ రేంజు 40కోట్లు. కానీ అతడి సినిమాకి ఆరంభమే 50కోట్ల బడ్జెట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు అది 130 కోట్ల రేంజుకు పెరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిజానికి హీరోల మార్కెట్ రేంజును మించి బడ్జెట్ పెట్టడం అంటే సాహసం. అది కూడా ఒక డెబ్యూ డైరెక్టర్ ని నమ్మి అంత పెద్ద మొత్తం పెడుతున్నారు. కాన్సెప్ట్ మంచిది కావొచ్చు. అదృష్టవశాత్తూ బడ్జెట్లు పెట్టగలిగే నిర్మాత దొరికి ఉండొచ్చు. కొడితే కుంభాన్ని కొట్టేయాలనుకునే టీమ్ సెట్టవ్వచ్చు. కానీ ప్రయోగం వికటిస్తే? దాని పర్యవసానం ఎలా ఉంటుందో కూడా ఊహించాలి. బడ్జెట్ల పరంగా అదుపు తప్పకూడదని దర్శకరత్న దాసరి వంటి వారు సూచించేవారు. పరిమిత సమయంలో డబ్బును వెనక్కి తెచ్చే సినిమాలు తీయాలని ఆయన ఆచరించి చూపించారు. కానీ నేటితరం హీరోలు, ఫిలిమేకర్స్ దీనిని అనుసరించడం లేదు. నేల విడిచి సాము చేసేందుకు వెనకాడటం లేదు! అయితే 130 కోట్ల బడ్జెట్ పెట్టినా 4,5 భాషల్లో మార్కెట్ చేయడం వారి ఉద్దేశం. కానీ అది సజావుగా పూర్తి చేస్తేనే కదా! ముందుకు సాగేది..!! ఇతరుల డబ్బుతో జూదం ఎంతవరకూ సబబు?
