టాలీవుడ్ సినిమాలు హై బడ్జెట్..మరి రిస్క్..!
టాలీవుడ్‌లో పాన్ ఇండియా సినిమాల ప్రవాహం మొదలైన తరువాత బడ్జెట్‌ల విషయంలో నిర్మాతలు, హీరోలు, డైరెక్టర్లు ఎక్కడా తగ్గడం లేదు.
By: Tupaki Desk | 31 Dec 2025 9:00 AM ISTటాలీవుడ్‌లో పాన్ ఇండియా సినిమాల ప్రవాహం మొదలైన తరువాత బడ్జెట్‌ల విషయంలో నిర్మాతలు, హీరోలు, డైరెక్టర్లు ఎక్కడా తగ్గడం లేదు. గతంలో రూ.20, రూ.30 కోట్లతో సినిమాలు చేస్తూ వచ్చిన వాళ్లు ఇప్పుడు `బాహుబలి` ఇచ్చిన ధైర్యంతో మూవీ నిర్మాణం కోసం వంద కోట్లు పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు. కొంత మంది వందకు మించి కూడా పెట్టేస్తూ పాన్ ఇండియా సినిమాలకు శ్రీకారం చుడుతున్నారు. హై బడ్జెట్‌తో భారీ లెవెల్లో బిజినెస్ చేసుకోవచ్చని ప్లాన్‌లు వేస్తున్నారు.
అయితే ఆ ప్లాన్‌లు కొన్ని సందర్భాల్లో మాత్రమే సక్సెస్ అవుతూ నిర్మాతలని లాభాలు తెచ్చి పెడుతుంటే మరి కొన్ని మాత్రం హై టెన్షన్‌కు గురి చేస్తున్నాయి. ఎంత పెద్ద స్టార్ హీరోతో సినిమా చేసినా మార్కెట్‌కు మించి బడ్జెట్ పెరగడంతో ఆ మొత్తం రిటర్న్ రాబట్టుకోవడం రిస్క్‌గా మారుతోంది. అనుకున్నట్టుగా సినిమా పే ఆఫ్ చేస్తే ఓకే కానీ అలా జరక్కపోతే మాత్రం నిర్మాతలు భారీ నష్టాలని చూడక తప్పని పరిస్థితి. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలు ంత రిస్క్‌లో ఉన్నాయంటే స్టార్స్ క్రేజ్ కారణంగా భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నాయి కానీ ఒక వేళ సినిమా పోతే మాత్రం కొన్ని 50 పర్సెంట్, 60 పర్సెంట్ నష్టాలని తెచ్చి పెట్టినవి కూడా ఉన్నాయి.
అదే చిన్న సినిమాలు తీస్తే మాత్రం కంటెంట్, క్వాలిటీ ఉన్నవి ఫ్లాప్ అయినా బ్రేక్ ఈవెన్ సాధించే ఛాన్స్ ఉంది. ఒక వేళ అది కూడా సాధించలేకపోతే వచ్చే నష్టాల శాతం తక్కువగా ఉంటుంది. అదే ప్రొడ్యూసర్స్ పెద్ద సినిమాలు చేస్తే మాత్రం రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఈ ఏడాది భారీ బడ్జెట్‌తో చేసిన సినిమాలు నిర్మాతలకు నష్టాలని తెచ్చి పెట్టాయి. విజయ్ దేవరకొండ `కింగ్‌డమ్`, రామ్ `ఆంధ్రా కింగ్ తాలూక` చిత్రాలు భారీ బడ్జెట్‌తో రూపొందాయి.
మంచి టాక్‌ని సొంతం చేసుకున్నాకానీ ఓవర్ బడ్జెట్ కావడంతో పెట్టిన పెట్టుబడిని పూర్తి స్థాయిలో తిరిగి రాబట్టలేక నిర్మాతలకు భారీ నష్టాలని తెచ్చి పెట్టి షాక్ ఇచ్చాయి. `అఖండ 2`ది కూడా ఇదే పరిస్థితి. దాదాపు రూ.200 కోట్లు దీని కోసం ఖర్చు చేస్తే నిర్మాతలకు ఇప్పటి వరకు ఎలాంటి లాభాల్ని అందించలేక తీవ్ర నిరాశకు గురి చేసింది. బోయపాటి డైరెక్షన్, `సూపర్ హిట్ `అఖండ`కు సీక్వెల్ గా వస్తున్న సినిమా కావడంతో దీనిపై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే బడ్జెట్ భారీగా పెరగడంతో ఆ స్థాయిలో అంచనాల్ని చేరుకోలేకపోయి ప్రొడ్యూసర్స్‌కి లాభాల్ని తెచ్చి పెట్టలేకపోయింది.
`బాహుబలి` తరువాత భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణం భారీ స్థాయిలో పెరిగినా రూ.200 కోట్లకు మించి ఖర్చు చేసే సినిమాల విషయంలో మాత్రం ఇప్పటికీ నిర్మాతలని రికవరీ భయం వెంటాడుతోంది. ఈ బడ్జెట్‌లో చేసే సినిమాలు హిట్ అనిపించుకుంటే కొంత వరకు మాత్రమే లాభాల్ని తెచ్చి పెడుతున్నాయి. అదే ఫ్లాప్ అంటే మాత్రం `గేమ్ ఛేంజర్` తరహాలో కోట్లు నష్టపోవాల్సిందే. ఆ టెన్షన్ మనకెందుకులే అనుకునే కొంత మంది ప్రొడ్యూసర్స్ మాత్రం కొత్త టాలెంట్‌ని నమ్ముకుని మినిమం బడ్జెట్‌లతో సినిమాలు చేసి కోట్లు గడిస్తున్నారు.
ఓ పక్క రిస్క్ అని తెలిసినా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చిన్న సినిమాలుగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో`, కోర్ట్, మ్యాడ్ స్క్వేర్ వంటి తదితర చిత్రాలు చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని సాధించి కొత్త తరహా బడ్జెట్ సినిమాలకు మరింత ప్రోత్సహాన్ని అందించాయి.
