అవివేకంతో 40కోట్లు పోగొట్టుకున్న నటి?
అయితే నిర్ధయగా తొలగించబడిన బడా హీరోయిన్ కి నష్టం 20కోట్లు, ప్లస్ లాభాల్లో వాటా మాత్రమే అనుకుంటే పొరపాటే!
By: Tupaki Desk | 6 Jun 2025 1:00 AM ISTఒక చిన్న ఈగో క్లాస్ 40 కోట్ల నష్టానికి దారి తీయొచ్చు. దర్శకుడితో క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ, ఉద్ధేశపూర్వకంగా చేయకూడని తప్పులు చేస్తే, హీరోయిన్ కి ఆవిడ పీఆర్ కి కూడా అక్షింతలు పడటం గ్యారెంటీ. కొత్తగా తల్లవ్వడానికి షూటింగులో తెలుగు లైన్స్ చెప్పను! అని భీష్మించుకు కూచోవడానికి లేదా లాభాల్లో వాటాలివ్వలేదని షాకు చెప్పడానికి లేదా సెట్లో ఆరు గంటలే ఉంటానని పట్టు పట్టడం.. ఇవన్నీ ఫెమినిజానికి పరాకాష్ఠగా భావిస్తే, దాని అంతిమ ఫలితం 40 -50 కోట్ల నష్టం అని చెబుతున్నారు క్రిటిక్స్.
ఏ దర్శకుడు అయినా కెప్టెన్ ఆఫ్ ది షిప్ గా గౌరవం అందుకుంటాడు. కానీ అందుకు భిన్నంగా ఒక పరభాషా కథానాయిక ముందు మోకరిల్లి, మోచిప్ప నీళ్లు తాగాలని కెప్టెన్ ఎవరూ అనుకోరు. కానీ ఈ సీనియర్ హీరోయిన్ ఫెమినిజాన్ని పరాకష్ఠకు చేర్చడమే గాక, తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు! అంటూ నిరూపించదలిచింది. దాని ఫలితం కూడా వెంటనే అందుకుంది. 1000 కోట్లు అంతకుమించి వసూలు చేయగల, ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ నుంచి వెంటనే దర్శకుడు ఆ హీరోయిన్ ని తొలగించి.. అంతగా ఫేమ్ లేని, ఒక సాధారణ నటిని ఆ పాత్రకు ఎంపిక చేయడం ఆ సీనియర్ బ్యూటీ సిగ్గు తీసేసినట్టు అయింది. ఇది ఇతర నటీమణులకు కూడా బిగ్ షాక్. హద్దు మీరితే కొరడా దెబ్బ ఎలా పడుతుందో తెలిసొచ్చింది!
అయితే నిర్ధయగా తొలగించబడిన బడా హీరోయిన్ కి నష్టం 20కోట్లు, ప్లస్ లాభాల్లో వాటా మాత్రమే అనుకుంటే పొరపాటే! ఇప్పుడు మరో 20 కోట్లు, లాభాల్లో వాటా కూడా తన నుంచి దూరమవ్వనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. బ్యాక్ టు బ్యాక్ రెండు పాన్ ఇండియన్ సినిమాల నుంచి ఈ సీనియర్ బ్యూటీని తొలగించే అవకాశం ఉందనేది ఈ గుసగుస సారాంశం.
ఇప్పటికే పాన్ ఇండియాలో సెన్సేషనల్ విజయం సాధించిన భారీ టాలీవుడ్ ప్రాజెక్ట్ నుంచి ఈవిడను ఊస్టింగ్ చేయడం గ్యారెంటీ అని గుసగుస వినిపిస్తోంది. ఆవిడ లేకపోయినా ఆ ప్రాజెక్టుకు నష్టం ఏదీ లేదు. ఆవిడలా నటించే మరో హీరోయిన్ ని తక్కువ పారితోషికానికే ఒప్పిస్తే, అది సినిమా బడ్జెట్ కి అదనంగా సహకరిస్తుందని భావిస్తున్నారట. అది ఏ ప్రాజెక్ట్ అన్నది మీరు ఈపాటికే ఊహించగలరు. 2024 లో విడుదలై 1000కోట్లు వసూలు చేసిన ఈ సినిమా సీక్వెల్ ని తొందర్లోనే ప్రారంభించేందుకు దర్శకనిర్మాతలు సన్నాహకాల్లో ఉండగా ఈ గుసగుసలు సదరు నటీమణికి పెద్ద నష్టం అనడంలో సందేహం లేదు!
