1000 కోట్ల మూవీ కోసం ఆస్తుల అమ్మకం?
పాన్ ఇండియాలో వెలగాలి అనే ఒత్తిడి నిర్మాతలను ఆర్థికంగా ముంచుతోందా? అంటే అవుననేందుకు ఆధారాలు లభిస్తున్నాయి. వందల కోట్ల పెట్టబడులను సమీకరించేందుకు ఉన్న సొంత ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది.
By: Tupaki Desk | 14 Jun 2025 9:29 AM ISTపాన్ ఇండియాలో వెలగాలి అనే ఒత్తిడి నిర్మాతలను ఆర్థికంగా ముంచుతోందా? అంటే అవుననేందుకు ఆధారాలు లభిస్తున్నాయి. వందల కోట్ల పెట్టబడులను సమీకరించేందుకు ఉన్న సొంత ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంతకుముందు క్వీన్ కంగన రనౌత్ `ఎమర్జెన్సీ` చిత్రాన్ని పూర్తి చేసేందుకు ముంబైలోని ఖరీదైన ప్రైమ్ ఏరియా ఆస్తిని అమ్ముకోవాల్సి వచ్చింది. అయినా ఆ సినిమా డిజాస్టర్ ఫలితం నిరాశపరిచింది. ఎమర్జెన్సీకి కంగన దర్శకనిర్మాతగా వ్యవహరించడం పెద్ద దెబ్బ కొట్టింది.
ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మించే సినిమా కోసం పెట్టుబడుల్ని సమీకరించేందుకు అతడికి ఉన్న ఆస్తుల్లో ఒక్కోదానిని అమ్ముతున్నారు. ఇటీవలే ముంబైలోని ఆయన, ఆయన కుమారుడికి చెందిన మూడు ఆస్తుల్ని అమ్మారు. ఈ మూడు ఆస్తుల విలువ 7కోట్లు. ఇవన్నీ ముంబై అంధేరి వెస్ట్ లో ఖరీదైన పోష్ ఏరియాలో ఉన్నాయి. అయితే ఈ డీల్ దేనికోసం? ఇప్పటికిప్పుడు అంత సడెన్ గా ఆస్తులు అమ్మడానికి కారణమేమిటి? అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఓ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం నిధుల సమీకరణలో భాగంగానే నిర్మాత, ఆయన కుమారుడు (స్టార్ హీరో) ఆస్తుల్ని అమ్ముతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిర్మాత కుమారుడు ఈ చిత్రంలో కథానాయకుడే గాకుండా దర్శకుడిగాను బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమాకి అపరిమిత బడ్జెట్ ని ఖర్చు చేయాల్సి ఉంది. అందువల్ల చాలా ప్రాపర్టీలను బ్యాంకులు, ఫైనాన్షియర్లకు తాకట్టు పెట్టే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. సరైన సమయంలో ఫైనాన్షియర్లు స్పందించకపోయినా ఆ ఒత్తిడి నిర్మాతపైనే పడుతుంది. కేవలం 7 కోట్ల విలువ చేసే ఆస్తుల అమ్మకాన్ని మాత్రమే చూడకూడదు.. ఇంకా ఈ భారీ ప్రాజెక్ట్ కోసం చాలా సాహసాలు చేయాల్సి ఉంటుంది! అని విశ్లేషిస్తున్నారు. భారీ బడ్జెట్ - ఆర్థిక ఒత్తిళ్ల కారణంగానే ఈ ప్రాజెక్ట్ ఆలస్యంగా ప్రారంభమైంది. కానీ దీనిని స్టార్ సన్ సవ్యంగా పూర్తి చేసి రిలీజ్ చేస్తారా? ఈ ఛాలెంజ్ లో అతడు నెగ్గుతాడా లేదా? అన్నది వేచి చూడాలి.
